జైలుబరో ఉధృతం

Jan 9,2024 21:41

నంద్యాలలో టెక్కె ఎస్‌బిఐ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించిన అంగన్‌వాడీలు

జైలుబరో ఉధృతం
– నాయకులు అరెస్టు, విడుదల
– రహదారిపై అంగన్వాడీలు బైఠాయింపు
– 29వ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె
– ఎస్మా ప్రయోగం దుర్మార్గం : సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో భాగంగా 29వ రోజు మంగళవారం నంద్యాల జిల్లాలో చేపట్టిన జైలుభరో కార్యక్రమం ఉధృతంగా సాగింది. జీతాలు పెంచబోమంటూ సజ్జల చేసిన ప్రకటనపైన అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచాల్సిందేనని, సమస్యలు పరిష్కరించాలని న అంగన్‌వాడీలు, నాయకులు నంద్యాల టెక్కె ఎస్‌బిఐ సర్కిల్‌ వద్దకు ర్యాలీగా వెళ్లి రహదారిపై బైఠాయించారు. ‘సమస్యలు పరిష్కరించాలి.. సిఎం జగన్‌, సజ్జల, బొత్స తప్పుడు ప్రచారం ఆపాలి.. జీతాలు పెంచమంటే మాపైన ఎస్మా ప్రయోగిస్తావా.. ఖాబర్దార్‌ సిఎం, మమ్మల్నే విధుల నుండి తొలగిస్తావా సిఎం సారు.. వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం..’ అంటూ నినదించారు. అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో టుటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కోరగా అంగన్వాడీలు భీష్మించి కూర్చున్నారు. దీంతో పోలీసులు అంగన్వాడీలతోపాటు సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు డి.లక్ష్మణ్‌, కెఎండి.గౌస్‌లను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో నాయకులు ఆందోళనను కొనసాగించారు. అంతకుముందు నంద్యాల పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో అంగన్‌వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించడం చేతకాక అంగన్వాడీలపైన ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని విమర్శించారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనేక ఏళ్లుగా చాలీచాలని జీతాలతో బతుకులు ఈడుస్తున్న అంగన్వాడీలపై ఉక్కు పాదం మోకాలని జగన్‌ ప్రభుత్వం చూడడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. అంగన్వాడీలపై తీవ్ర చర్యలు ఉంటే ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించాలన్నారు. 24 గంటల దీక్షలలో బనగానపల్లె, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల మండలాల నుండి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కూర్చున్నారు. కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాణి, ప్రాజెక్టు కార్యదర్శి సునీత, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.యేసురత్నం, ఏ.నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటలింగం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. బనగానపల్లె : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంతో సిఐటియు నాయకులు, అంగన్వాడి వర్కర్లు జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నుండి పెట్రోల్‌ బంకు కూడలి వరకు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధర్నాతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది దీంతో పోలీసులు సిఐటియు నాయకులను, అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి అంగన్వాడీ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, జిల్లా నాయకులు సుధాకర్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ కార్యదర్శి జెవి.సుబ్బయ్య, నాయకులు భాష, దస్తగిరి, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి రోజా రమణి, రమాదేవి ,వరలక్ష్మి, మల్లేశ్వరి, శశికళ ,మహేశ్వరి, రమణమ్మ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

➡️