కౌలు రైతులకు కష్టాలు తప్పవా?

Jun 25,2024 22:18
జిల్లాలో ఐదున్నర లక్షల మందికి పైగా

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదున్నర లక్షల మందికి పైగా వరి రైతులుండగా వీరిలో మూడున్నర లక్షల మందికి పైనే కౌలు రైతులున్నారు. సాధారణ రైతుల మాదిరిగా రుణాలు, రాయితీలు, వడ్డీ మాఫీ పథకాలు, పంటల నష్టపరిహారం వంటి ప్రభుత్వ ప్రయోజనాలు వీరికి సక్రమంగా అందడం లేదు. ప్రతి ఏటా అప్పులు చేసి సాగు చేస్తున్నా పెట్టుబడి సొమ్ములు కూడా రాని పరిస్థితులు నెలకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు వచ్చి పంటలకు నష్టం జరిగితే అనేకమంది అప్పుల ఊబిలోకి కూరుకుయి చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలా కౌలు రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటున్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిసిఆర్‌ కార్డుల జారీలో జాప్యం చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా పూర్తిస్థాయిలో రైతులందరికీ కార్డులు అందడం లేదు.జాప్యంతో ఇబ్బందులుజిల్లాలో 70 శాతం పంటలను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సొంతభూమి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలకు తోడు ఇప్పటికే వారి ఖాతాలో జమ అయిన రైతు భరోసా సొమ్ముతో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ జిల్లాలో ఉన్న కౌలు రైతుల పరిస్థితే మరింత దుర్భరంగా మారింది. వారిని గుర్తించడంలో తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటుంది. ప్రభుత్వం ఏటా వారికి అందించే సిసిఆర్‌సి(క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డు)పత్రాలు ఇప్పటికీ వారికి అందలేదు. యంత్రాంగం వాటి జారీ పనిలో ఉంది. గతంలో ఈ కౌలు పత్రాలు కలిగి ఉన్న రైతులు కూడా మళ్లీ రెన్యువల్‌ చేయించుకుంటేనే కార్డు మనుగడలోకి వస్తుంది. సిసిఆర్‌సి కార్డు గడువు 11 నెలల్లో ముగుస్తుంది. మళ్లీ భూ యజమాని అనుమతితో కార్డును రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెలాఖరుకు ముగించి ఖరీఫ్‌ ప్రారంభమయ్యే జూన్‌ మొదటి వారంలోపే కార్డులను రైతులకు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ నత్తనడకన నడుస్తుంది. ఆగస్టు, సెప్టెంబర్‌ వరకూ కార్డులు అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయశాఖ మార్గదర్శకాల ప్రకారం సంబంధిత పత్రాలన్నీ రైతులు సమర్పిస్తే విఆర్‌ఒల ఆమోదంతో ఈ కార్డులను కౌలు రైతులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ అంతా జరిగి రైతులకు కార్డులు అందేసరికి ఆగస్టు ముగిసిపోయే అవకాశం ఉందని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలతో పాటు అర్హత కలిగిన వారి రైతుభరోసా సాయానికి కూడా తీవ్ర జాప్యం జరుగుతుందని చెబుతున్నారు. సిసిఆర్‌సి కార్డులు సకాలంలో అందక కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు.నత్తనడకన జారీ ప్రక్రియ మూడు జిల్లాల్లో మూడున్నర లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. అయితే ప్రభుత్వం అతి తక్కువగానే లక్ష్యాన్ని నిర్ధేశించి అందజేస్తుంది. కాకినాడ జిల్లాలో 57 వేల కార్డులను అందించాలని లక్ష్యంగా తీసుకున్నారు. వీరిలో సుమారు 46 వేల మందికి రూ.190 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 450 మందికి మాత్రమే కార్డులు అందజేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 77 వేలు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కార్డు కూడా జారీ చేయలేదు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 1.09 లక్షలు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 1300 మాత్రమే కార్డులు ఇచ్చారు. దీనిపై రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో భూ యజమానులకు సిసిఆర్‌ కార్డులపై అవగాహన కల్పించాలి. కార్డుని కౌలుదారుకి ఇచ్చినంత మాత్రాన భూమిపై యజమాని హక్కులకు వచ్చిన ముప్పేమి లేదని వివరించాలి. అదేవిధంగా కౌలు రైతులకు సైతం కార్డు వల్ల ఉపయోగాలను చెప్పి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. కానీ ఇవేమీ అమలు జరగడం లేదు.ప్రయోజనాలు కోల్పోతున్న కౌలు రైతులుక్షేత్రస్థాయిలో భూ యజమాని ఒప్పంద పత్రం తప్పనిసరి అంటున్న కారణంగా లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వం కౌలు రైతులకు కచ్చితంగా న్యాయం చెయ్యాలనుకుంటే భూ యజమాని ఒప్పంద పత్రం తీసుకునే బాధ్యతను రాష్ట్రప్రభుత్వమే తీసుకోవాలి. ఈ విధంగా కార్డులు ఇవ్వడం వలన పంట మీద వచ్చే రాయితీలను కౌలు రైతులకు చేరతాయి. కానీ అన్ని రాయితీల్లోనూ కేవలం 10 శాతం కూడా కౌలు రైతులకు దక్కడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాస్త్రీయమైన ఆధారాలతో వాస్తవ సాగు దారులకు కేటాయించిన రాయితీలు పూర్తిగా చేరితేనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది.

➡️