తాళాలు పగలగొట్టడానికి యత్నం

Dec 18,2023 17:04

చిన్నకంబలూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రం తలపు పగలగొడుతున్న రెవెన్యూ సిబ్బందిని అడ్డుకుంటున్న అంగన్వాడి కార్యకర్తలు

తాళాలు పగలగొట్టడానికి యత్నం

– అధికారులను అడ్డుకున్న అంగన్వాడీలు

– అండగా నిలిచిన లబ్ధిదారులు, సిఐటియు, రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి – రుద్రవరం

రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామంలోని అంగన్వాడి సెంటర్‌ తాళాలు పగలగొట్టేందకు విఆర్‌ఒ, సచివాలయ సిబ్బంది సోమవారం యత్నించారు. విషయం తెలుసుకున్న అంగన్వాడి కార్యకర్తలు పద్మావతి, షహీన్‌, మరియమ్మ, ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి నాగలక్ష్మి అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తలారులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది. అంగన్‌వాడీలకు మద్దతుగా సెంటర్‌ లబ్ధిదారులు, సిఐటియు నాయకులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, ప్రజలు తరలివచ్చి తాళాలు పగలగొట్టకుండా అడ్డుకున్నారు. అంగన్‌వాడీలు మాట్లాడుతూ గత వారం రోజులుగా జీతాలు పెంచాలని సమ్మె చేస్తున్న తమను పట్టించుకోని ముఖ్యమంత్రి దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టించి సెంటర్లు తెరిచే చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. వేతనాలు పెంచేంతవరకూ సెంటర్లను తెరవనివ్వబోమని హెచ్చరించారు. నాయకులు రామచంద్రుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ అనుమతి మేరకే తాళాలు పగలగొట్టడానికి వచ్చామని చెబుతున్న అధికార యంత్రాంగం, తోటి ఉద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తూ గత్యంతరం లేక సమ్మె బాట పట్టిన అంగన్‌వాడీలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ఆలోచించాలన్నారు. దౌర్జన్యంగా సమ్మె విచ్చిన్నం కోసం తాళాలు పగలగొట్టేందుకు పూనుకుంటే అంగన్వాడీలకు మద్దతుగా రైతులు, కూలీలు, కార్మికులు తరలివచ్చి మరింత తీవ్రస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తారని అన్నారు. మొండిగా పట్టుదలకు పోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో వారితో చర్చించి డిమాండ్స్‌ను తీర్చాలని కోరారు.

➡️