పటిష్ట నిఘాకు చర్యలు

Jan 6,2024 21:12

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

పటిష్ట నిఘాకు చర్యలు
– జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టర్‌
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్ట నిఘాకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో శనివారం కలెక్టర్‌ ఛాంబర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, నగదు, ఇతర గిఫ్ట్ల పంపిణీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్ట నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా మద్యం, డబ్బు వంటి వాటి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గట్టి నిఘా పెట్టి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా కేంద్రాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించేందుకు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందాల్లో పోలీసు, రెవెన్యూ, ఇన్కమ్‌ టాక్స్‌, కమర్షియల్‌ టాక్స్‌, బ్యాంక్‌ అధికారులు, ఎక్సైజ్‌, అటవీశాఖల అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ బృందాలు 24 గంటలూ సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌ అధికారులు అనుమానిత వ్యక్తులు, వాహనాలను క్షుణంగా పరిశీలించాలని, ఎటువంటి అక్రమ రవాణా చర్యలకు పాల్పడినట్లు అనుమానం వస్తే సంబంధిత వ్యక్తులను విచారించి, నిర్ధారణ అయితే తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

➡️