వైసిపి అవినీతి, అక్రమాలతో రాష్ట్రం సర్వనాశనం

Apr 16,2024 16:30

మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌, మల్లెల రాజశేఖర్‌ తదితరులు

వైసిపి అవినీతి, అక్రమాలతో రాష్ట్రం సర్వనాశనం
– సానుభూతి కోసం గులకరాయి డ్రామా : టిడిపి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్‌ రెడ్డి ప్రజలకు చెప్పుకోవడానికి ఒక మంచి పని చేయలేదని అనుభవరాహిత్యం, అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి, నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండి ఫరూక్‌, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, నంద్యాల అబ్జర్వర్‌ పోతురాజు రవికుమార్‌ అన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్‌ఎండి ఫరూక్‌ మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో ఒక పరిశ్రమ తేలేదని, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. రాష్ట్ర పురోగతిని సైతం బలి చేశారన్నారు. అరాచకత్వంతో ఆంధ్రప్రదేశ్‌ను అగాధంలోకి నెట్టేశారని, ఇప్పుడు జగన్‌ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. నాడు గొడ్డలి వేటు, కోడి కత్తి, ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్‌ తెరలేపారన్నారు. రాత్రి 7 గంటల నుంచి కరెంటు తీసేయడం, 8:10 గంటలకు దాడి ఘటన అంటూ ప్రచారం, రాత్రి 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లడం ఇదంతా సానుభూతి నాటకాలు కాదా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన నాలుగవ నిమిషానికి క్యాట్‌ బాల్‌ ఉపయోగించారని సాక్షి బులుగు మీడియాకు, జగన్‌ సోషల్‌ మీడియాకు ఎలా తెలుసని ప్రశ్నించారు. డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు, పోలీసులు నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారని, చేయించుకున్న కుట్ర కాబట్టి పట్టుకోలేదన్నారు. క్యాట్‌ బాల్‌ దాడి జరిగే సరికి ఎలా కనుబొమ్మపై తగులుతుందని, ప్రజలు ఏమైనా అమాయకులా అని ప్రశ్నించారు. సిఎం పర్యటనలో ఎందుకని 3 గంటలు కరెంటు కోత నిర్వహించారని, అక్కడ కరెంటు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు. చీకట్లో జగన్‌ రోడ్‌ షోకు ఎలా అనుమతించారని, ఇది ముందస్తు కుట్రలో భాగమేనన్నారు. బస్సు యాత్ర తుస్సుమందని, ప్రజా వ్యతిరేకత అర్థమయ్యే ఈ సానుభూతి నాటకం ప్రచారం చేసుకుంటున్నారని, డ్రామాలను ప్రజలు నమ్మే రోజులు పోయాయని,గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

➡️