రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్‌

Jan 2,2024 21:52

వాహనాలు అడ్డుకుంటున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌ తదితరులు

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్‌
– కోర్టులో హాజరు.. 10 రోజులు జుడీషియల్‌ రిమాండ్
– నందికొట్కూరు సబ్‌ జైలుకు తరలింపు
– పోలీసు వాహనాన్ని అడ్డుకున్న రైతు సంఘం నాయకులు
– ఏడేళ్ల క్రితం కేసుకు సంబంధించి అరెస్టు చేసిన వైనం
ప్రజాశక్తి – ఆత్మకూరు
రాయలసీమ వాసుల డిమాండ్‌ సిద్దేశ్వరం అలుగు ఏర్పాటు కోసం ఏడు సంవత్సరాల క్రితం రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి ఆధ్వర్యంలో సిద్దేశ్వరం అలుగు దగ్గర చేపట్టిన సందర్భంగా పెట్టిన కేసులో మంగళవారం ఆయనను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు ఆత్మకూరు కోర్టులో హాజరు పరిచారు. ఆత్మకూరు జుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ బొజ్జా దశరథరామిరెడ్డికి పది రోజులు జుడిషియల్‌ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో పోలీసులు దశరథరామిరెడ్డిని కస్టడీలోకి తీసుకుని నందికొట్కూరు సబ్‌ జైలుకు తరలించారు. అంతకుముందు ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, సిపిఎం పట్టణ కార్యదర్శి రణధీర్‌ల ఆధ్వర్యంలో రైతులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు, రైతులు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. ప్లే కార్డులు ప్రదర్శిస్తూ బొజ్జ దశరథరామిరెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని, రాయలసీమకు సాగు, తాగునీరు అడిగితే అరెస్ట్‌ చేయడం అన్యాయమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పోలీసులు రైతులను అతికష్టం మీద పక్కకు నెట్టివేసి దశరథరామిరెడ్డిని నందికొట్కూరు సబ్‌ జైలుకు తరలించారు.
రైతు సంఘం ఆధ్వర్యంలో రహదారిపై నిరసన

వెలుగోడు : రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డిని అరెస్ట్‌ చేయడం అన్యాయమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, సీనియర్‌ నాయకులు యాదాటి నాగేంద్రుడు ఖండించారు. నంద్యాల నుండి వెలుగోడు మీదుగా బొజ్జ దశరథ రామిరెడ్డిని పోలీసు వాహనంలో తరలించే సమయంలో రైతు సంఘం వెలుగోడు నాయకులు ఉదారు రామలింగేశ్వర రెడ్డి, నసిరుల్లా ఖాన్‌, ముక్క మల్ల భాస్కర్‌ రెడ్డి, రాఘవరావు సుమారు 20 మంది రైతులతో కలిసి రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
బొజ్జ దశరథ రామిరెడ్డి అరెస్టు అక్రమం : రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ కుమార్‌
నంద్యాల కలెక్టరేట్‌ : రాయలసీమ సాగునీటి సాధన సమితి, రైతు ఉద్యమ నాయకులు బొజ్జ దశరథ రామిరెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసి ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ తరలించి, అక్కడి నుండి కోర్టుకు తరలించడాన్ని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రమేష్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం సిద్దేశ్వరం అలుగు దగ్గర చేసిన ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను తిరగదోడి ఈ రోజు అరెస్టు చేయడాన్ని అన్యాయమన్నారు. రాయలసీమ ప్రజల డిమాండ్‌ సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని అనేక సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు, రాయలసీమ సాధన సమితి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా, చేసిన ఆందోళనపైన అక్రమంగా కేసులు పెట్టి, వాటిని తిరగదోడి అక్రమ కేసును బనాయించడాన్ని రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులందరూ తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు.రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా అయిన జగన్‌ తరాయలసీమ ప్రాంత నీటి సమస్యపైన ఆందోళనలు చేస్తే అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రైతులపై ఈ రకమైన దాడి ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, జగన్‌ ప్రభుత్వం అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే బొజ్జా దశరథ రామిరెడ్డిని బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️