సడలని సంకల్పం

Dec 23,2023 21:22

సడలని సంకల్పం
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి
అంగన్‌వాడీల సమ్మెను నిలిపివేయాలని ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నుతున్నా, ఎన్ని చర్యలు చేపడుతున్నా వారి సంకల్పం సడలడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాలని 12 రోజులుగా సమ్మె చేపడుతూనే ఉన్నారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. భిక్షాటన ఎత్తుతున్నారు. ఒంటికాలిపై నిలబడి నిరసన తెలుపుతున్నారు. వంటావార్పు నిర్వహించారు. మెడకు ఉరితాళ్లలో నిరసన తెలిపారు. రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. అయినా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం శీత కన్ను ప్రదర్శిస్తోంది. గత 12 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. చర్చల పేరుతో కాలయాపన చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బందికి అప్పగించడం దారుణం. అంగన్‌వాడీలకు, సచివాలయ ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తోంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 వరకు అంగన్వాడీ కేంద్రాల్లోఉంటూ గర్భిణీలకు, గర్భతులకు, పిల్లలకు సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్మికులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. నాడు-నేడు పనులు కూడా అంగన్వాడీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. దీని వలన అంగన్వాడీ లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదు. గర్భిణీలకు, గర్భతులకు, పిల్లలకు సరైన సేవలు అందవనే వాదన వినిపిస్తుంది. అంగన్వాడీల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం చొరవ చూపాలని, తక్షణమే చర్చలు జరిపి అంగన్వాడీ వ్యవస్థను కాపాడాలని, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రభుత్వానికే నష్టమని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు.రేషన్‌ బండికి జిపిఎస్‌ : ఇంటి వద్దకే రేషన్‌ సరకులు అందించటానికి ఎండీయూ వాహనాలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన చౌక దుకాణాల్లో సరకుల పంపిణీ ప్రారంభమయ్యేది. నెల మొత్తం కొనసాగేది. కూలి పనులు చేసుకునే వారు, ఏదైనా అవసరంపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు నెలలో ఏదో ఒకరోజు సరకులు తీసుకెళ్లే వారు. ఎండీయూ వాహనం వచ్చిన రోజు ఇంటి వద్ద లేకుంటే ఇక ఆ నెలలో సరకులు ఇవ్వడం లేదు. దీనిపై కార్డుదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌ వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రేషన్‌ వాహనాలకు జిపిఎస్‌ వ్యవస్థను ఆమ సంధానించి ఏమేరకు తిరుగుతున్నాయి. కార్డుదారులకు రేషన్‌ పంపిణీ సక్రమంగా జరుగుతోందో పర్యవేక్షించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో వాహనానికి రూ.10 వేలు ఖర్చు చేసి జిపిఎస్‌ పరికరాలను అమర్చాలని అధికారులు నిర్ణయించారు.ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు : అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెస్‌) జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు కర్నూలు నగరంలో నిర్వహించారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు సాగాయి. తొలి రోజు ఉదయం పతాకావిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. అఖిల భారత అధ్యక్షులు అశోక్‌ థావలే అధ్యక్షోపన్యాసం చేశారు. మధ్యాహ్నం కర్నూలు నగరంలో సుందరయ్య కూడలి నుంచి పాత బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకూ భారీ రైతు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. తరువాత రెండు రోజుల పాటు కౌన్సిల్‌ సమావేశాలు కొనసాగాయి. మొత్తంగా 11 తీర్మానాలకు ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం ఆమోదం తెలిపింది. అవీ..ఇవీ..అన్నీ..కోవెలకుంట్ల మండలం వెలగటూరు గ్రామంలో సిఆర్‌పిఎఫ్‌ ఎఎస్‌ఐ జివి.సుధాకర్‌ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి నుండి ప్రారంభించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ అరబిక్‌ దినోత్సవాన్ని సోమ వారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులరద్దీ తగ్గకుండా కొనసాతోతుంది. వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

➡️