సమయ పాలన పాటించాలి

Feb 5,2024 21:31

స్పందనలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

సమయ పాలన పాటించాలి
– హాజరు కాని అధికారులకు షోకాజ్‌ నోటీసులు
– స్పందన విజ్ఞప్తుల పరిష్కారానికి చర్యలు
– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి సకాలంలో హాజరు కాని అధికారులపై జిల్లా కలెక్టర్‌ కె.శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో హాజరు కాని అధికారులకు షోకాస్‌ నోటీసులు ఇవ్వాలని డిఆర్‌ఒ పద్మజను ఆదేశించారు. అంతకుముందు వైఎస్సార్‌ సెంటినరీ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా నలమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్‌ విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన విజ్ఞప్తులకు వేగవంత పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో అధికారుల హాజరు తీసుకుంటుండగా కొంతమంది అక్కడ లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌ నివ్వెరపోయారు. ఉదయం 10:30 గంటలైనా కొంతమంది అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన సమస్యలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించదగ్గ సమస్యలను ఏ మాత్రం జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యలకు సవివరమైన కారణాలు తెలుపుతూ ఎండార్స్మెంట్‌ ఇచ్చి విశదీకరించాలని చెప్పారు. పత్రికలో వచ్చిన ప్రతికూల వార్తలు కూడా వెంటనే స్పందించి అదేరోజు సాయంత్రంలోగా రీజాయిండర్లు ఇవ్వాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో మొత్తం 211 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్‌ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.స్పందనలో కొన్ని వినతులు..- ‘బైక్‌ మీద వెళ్తుంటే ప్రమాదవశాత్తు కింద పడి కాలు విరిగి పూర్తిగా తీసేశారు. జీవనోపాధి కోసం పనికి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నాకు మూడు చక్రాల సైకిల్‌ ఇప్పించి సహాయం చేయగలరు’ అనినంద్యాల పట్టణంలోని దేవనగర్‌కు చెందిన సిహెచ్‌.అచ్చయ్య కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.- ‘నాకు నందికొట్కూరు పొలిమేర సర్వే 196లో 3 ఎకరాల ప్రభత్వ భూమిని 45 సంవత్సరాల నుండి సాగుచేసుకుంటున్నాను. పొలం నా పేరు మీద లేదు. ఆన్లైన్‌ చేయించి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించగలరు’ అని నందికొట్కూరు ఎబిఎం పాలెం వాసి వడ్డెమాను మద్దిలేటి వినతిపత్రం అందజేశాడు. – ‘నేను వితంతువు పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకొంటే పేరు వచ్చింది కానీ డబ్బులు పడడం లేదని సచివాలయం సిబ్బంది చెబుతున్నారు. నా సమస్యను పరిష్కరించి న్యాయం చేయండి’ అంటూ కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామ బాధితురాలు కె.మహేశ్వరమ్మ కలెక్టర్‌కు అర్జీ సమర్పించింది.

➡️