హామీలు అమలు చేయాలి

Feb 5,2024 21:29

నందికొట్కూరు ఎంఈఓ ఆఫీసు నందు వినతిపత్రం ఇస్తున్న సిఐటియు నాయకులు

హామీలు అమలు చేయాలి
– ‘మధ్యాహ్న భోజన’ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– సిఐటియు ఆధ్వర్యంలో ఎంఇఒ కార్యాలయాల ఎదుట నిరసన
ప్రజాశక్తి – విలేకరులు
పగిడ్యాల : మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.భాస్కర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్‌సి భవనంలో ఎంఇఒ సుభాన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి నాడు పాదయాత్రలో మధ్యాహ్న భోజన పథక కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇచ్చి, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వా దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నా పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్రలో మడమ తిప్పను మాట తప్పనని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దేవమ్మ, విమలమ్మ, నాగరత్నమ్మ, నాగమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. బేతంచెర్ల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు కనీస వేతనం అమలు చేసి, పని భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై ఎల్లయ్య, మండల కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బేతంచెర్ల మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్నం భోజనం కార్మికుల మండల నాయకురాలు రుక్మిణి దేవి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులు 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకపోగా ప్రభుత్వం బడ్జెను తగ్గించడం దారుణం అన్నారు. ప్రభుత్వము సకాలంలో బిల్లులు చెల్లించకపోయినా వడ్డీలకు తెచ్చి విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్న వంటలకు ఆయా పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు, పెన్షన్స్‌ సౌకర్యం కల్పించకపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం మంచి ఆహారము వండి పెట్టాలంటే ఒక విద్యార్థికి 20 రూపాయలు మెనూ చార్జీలు పెంచాలని వారన్నారు. ప్రస్తుతము ప్రాథమిక విద్య అందిస్తున్న స్కూళ్లలో ఒక్క రూపాయి పావుల నుండి ఐదు రూపాయల వరకు చెల్లిస్తూ మాతో వెట్టి చాకిరి చేయించుకుంటుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మధ్యాహ్నం భోజనం వండే కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల విద్యాధికారి సోమశేఖర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఆత్మకూర్‌: మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలని సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు రణధీర్‌, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ నాయకురాలు శంషాద్‌ బి, ముబారక్‌లు అన్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం దగ్గర మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ జానికిరాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచ డానికి పిల్లలకు రుచికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతినెల 5 తేదీ లోపల వేతనాలు బిల్లులు ఇవ్వాలని కోరారు. నందికొట్కూరు టౌన్‌ : మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి మధ్యాహ్నం భోజన కార్మికుల సంఘం నాయకురాలు మల్లేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.భాస్కర్‌ రెడ్డి, నాయకులు టి.గోపాలకృష్ణ మాట్లాడారు. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ 20 లకు పెంచాలని తదితర సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. కొత్తపల్లి : మధ్యాహ్నం భోజనం కార్మికులకు 10 వేల రూపాయల వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మండల అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు డిమాండ్‌ చేశారు. కొత్తపల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీరాములుకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పిల్లలకు రుచికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది అన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించిన ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరు కారుస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే మధ్యాహ్నం భోజనం కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వాగ్దానం చేసి ఐదు సంవత్సరాలు కావస్తున్న ఇచ్చిన ఇవ్వడం లేదన్నారు. పెరిగిన ధరలతో కేవలం మూడు వేల రూపాయల వేతనంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించి వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురి అయితే నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్‌ ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు రమాదేవి, జల్లి లక్ష్మీదేవి, ఆనందమ్మ, రాణమ్మ, చెన్నమ్మ, మంగమ్మ, లింగమ్మ, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

➡️