హౌసింగ్‌ బిల్లు మంజూరైనా జమ కాలేదు

Feb 26,2024 21:44

స్పందనలో వినతులు స్వీకరిస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

హౌసింగ్‌ బిల్లు మంజూరైనా జమ కాలేదు
– సమస్యను పరిష్కరించాలని బాధితుడు జెసికి వినతి
– స్పందన విజ్ఞప్తులకు సత్వర పరిష్కార చర్యలు
– జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
‘నాకు 2023 సంవత్సరంలో హౌసింగ్‌ బిల్‌ మంజూరైనట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. కానీ నా అకౌంట్‌లో బిల్లు అమౌంట్‌ జమ కాలేదు. నా సమస్యను పరిష్కరించి న్యాయం చేయండి’ అంటూ బాధితుడు గడివేముల మండలం కొర్రపోలురు గ్రామ శ్రీనివాసులు స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు అర్జీ సమర్పించాడు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డిఆర్‌ఒ ఎ.పద్మజ, ఇతర జిల్లా అధికారులు పాల్గొని జిల్లాలోని వివిధ నలమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి వేగవంత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారునికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన రీతిలో ఎండార్స్మెంట్‌ ఇచ్చి అర్థమయ్యేలా అర్జీదారునికి వివరించాలని ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా గడువులోపే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే క్లియర్‌ చేయాలని ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు- ‘సర్వే నంబర్‌ 35ఎలో నాకు 5.08 ఎకరాల పొలం ఉంది. ఇందుకు సంబంధించి డీ-నమూనా పట్టా పొందాను. ఆన్‌లైన్‌లో ఈ- పాస్‌ పుస్తకం రాలేదు. ఇప్పించగలరు’ అని కోరుతూ ఆత్మకూరు మండలానికి చెందిన ఫిరోజ్‌ బాషా జెసికి దరఖాస్తు సమర్పించాడు.- ‘సర్వే నంబర్‌ 132/2లో 5 ఎకరాల భూమిని మ్యుటేషన్‌ చేయించుకొనేందుకు వెళ్తే ఎర్రర్‌ వస్తుంది. ఎనేబుల్‌ చేసి నా సమస్యను పరిష్కరించండి’ అని మిడ్తూరు మండలం సుంకేసుల గ్రామ మహిళ గోపాలం సంజమ్మ జెసి అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 176 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్‌ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ జెసి ఆదేశాలు జారీ చేశారు.

➡️