6 నుండి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు

Mar 31,2024 17:17

ఏర్పాట్లను పరిశీలిస్తున ఇఒ

6 నుండి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు
– ఏర్పాట్లను పరిశీలించిన ఇఒ
ప్రజాశక్తి – శ్రీశైలం
ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల జరగనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు తమ సిబ్బందితో కలిసి ఆదివారం యాంపిథియేటర్‌, మల్లమ్మ కన్నీరు, పలు ఉద్యానవనాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, వలయా రహదారి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఉత్సవాల ప్రత్యేక విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పలు చోట్ల చలువ పందిళ్ళు వేయించామని చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులు సేద తీరేందుకు మరిన్ని చోట్ల, యాంపిథియేటర్‌ వద్ద ఆరుబయలు ప్రదేశాలలో చలువ పందిళ్ళు వేయించాలని, మంచినీరు నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, క్షేత్ర పరిధిలో పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలకు దేవస్థానం తరపున సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ముఖ్యంగా మంచినీరు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పారిశుధ్య నిర్వహణ నిరంతరం కొనసాగించాలన్నారు. క్షేత్ర పరిధిలో అన్ని చోట్ల ఎప్పటికప్పుడు చెత్తకుప్పలను తొలగిస్తూ ఉండాలని, ట్రాక్టర్ల ద్వారా డంప్‌ యార్డుకు తరలించాలని చెప్పారు. క్షేత్ర పరిధిలోని మరుగుదొడ్ల వద్ద శుభ్రత పాటించాలని, అక్కడ నిరంతరం నీటి సరఫరా అందించాలని సూచించారు. యజ్ఞావాటిక వద్ద పార్కింగ్‌ ప్రదేశాలలో ఆయా బస్సులు నిలిపేందుకు రీజియన్లు, డివిజన్ల వారీగా బస్సులు నిలిపేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దేవస్థానం పరిధిలోని దుకాణదారులు ఆయా వస్తువులు అధిక ధరలకు అమ్మకుండా అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని రెవిన్యూ విభాగ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇఇ రామకృష్ణ, ఇన్‌ఛార్జి డిఇలు పివి సుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌ శాస్త్రి, శ్రీశైలప్రభ ఎడిటర్‌ అనిల్‌ కుమార్‌, సహాయ ఇంజనీర్లు, ఉద్యానవన అధికారి లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️