నాబ్‌ నిర్వాసితుల సమస్యలపై నిర్లక్ష్యం

నాబ్‌ నిర్వాసితుల సమస్యలు

215రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గం

సిపిఎం జిల్లా నేత రొంగలి రాము

ప్రజాశక్తి – అనకాపల్లి డెస్క్‌ : నాబ్‌ నిర్వాసితుల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని సిపిఎం జిల్లా నాయకులు రొంగలి రాము ఆరోపించారు. పెద్దకలవలపల్లి చుట్టూ నాబ్‌ నిర్మిస్తున్న రక్షణగోడకు వ్యతిరేకంగా 215 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆదివారం నిరసన దీక్ష శిబిరాన్ని సిపిఎం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2009లో వాడ నరసాపురం, కొత్తపట్నం, బంగరమ్మపాలెం గ్రామాల సమస్యలను, అలాగే పుడిమడక పైపులైన్‌ సమస్య, 2023లో మళ్లీ వాడ నరసాపురం, కొత్తపట్నం సమస్యలపై పోరాటం చేసి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి సిపిఎం కృషి చేసిందన్నారు. అయినప్పటికీ ఇంకా ఎన్నో నిర్వాసితుల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ముఖ్యంగా పెద్దకవలపల్లిలో సుమారు 8 కిలోమీటర్లు మేర ప్రజల నివాసాలు, గ్రామాలకు అడ్డంగా నాబ్‌ నిర్మిస్తున్న రక్షణ గోడ వల్ల ఏళ్లతరబడి ఇక్కడే నివసిస్తున్న వారికి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉండగా, కనీసం వారిని సంప్రదించకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్లడం దుర్మార్గమన్నారు.. సిపిఎం మండల కన్వీనర్‌ జి.దేముడు నాయుడు మాట్లాడుతూ నాబ్‌ నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించకపోతేఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిర్వాసితుల పక్షాన పోరాటానికి సిపిఎం ఎపుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమములో మాజీ ఎంపిటిసి రావి దేముల్లు, మారిశెట్టి నాగలక్ష్మి, పుణ్యమంతుల వారాలు , ఎలమంచిలి లక్ష్మి, నాబ్‌ బాధితులు పాల్గొన్నారు.

ఆందోళన చేస్తున్న నాబ్‌ నిర్వాసితులు

➡️