సమోసా వద్దు.. మందు ఓకే!

May 16,2024 23:56

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి ఇంటి వీధిలో వేసిన కంచె
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల సందర్భంగా ఏర్పడిన వివాదాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. మాచర్లలో పటిష్టంగా ఇది అమలవుతున్నా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కొంత భిన్నంగా ఉంది. చిరు వ్యాపారులను, చిన్నపాటి దుకాణదార్లను బెదిరించి దుకాణాలు మూయిస్తున్న పోలీసులు మద్యం దుకాణాలను మాత్రం యథేచ్ఛగా కొనసాగనిస్తున్నారు. రోడ్డు వెంట చిరుతిళ్లు అమ్ముకుని జీవన పోరాటం సాగించే వారిని చొక్కాపట్టుకు లాక్కెళ్లడం, వారి సామగ్రిని వాహనాల్లో వేసుకెళ్లడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. సమోసాలు అమ్ముకుంటే లాక్కెళ్తున్న పోలీసులు మద్యం అమ్మకాలను మాత్రం ఆపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మెడికల్‌ షాపులనూ మూసేయిస్తున్నారు. గుంటూరు రోడ్డులోని తన హాస్పిటల్‌లోనే నివాసం ఉంటున్న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన హాస్పిటల్‌పై రాళ్ళ దాడి, కాన్వారు ధ్వంసం ఘటనల నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా పెద్ద వివాదాలు లేకున్నా నరసరావుపేట పట్టణంలో జరిగిన ఘర్షణల దృష్ట్యా శ్రీనివాసరెడ్డి ఇంటి వైపు ఆ వీధిలో ఎవరు వెళ్లకుండా బారికేడ్లు పెట్టడంతో పాటు ముళ్లకంచెను సైతం వేసి పహార కాస్తున్నారు. ప్రధాన కూడళ్లలో దుకాణాలు మూసి వేయించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాలోల వివాదాలు తమకు అవస్థలు తెచ్చిపెట్టాయని పట్టణ ప్రజలు నిట్టూరుస్తున్నారు. 144 సెక్షన్‌ అమలుపై జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను ప్రజాశక్తి సంప్రదించగా దుకాణాలు పోలీసులు బలవంతంగా ఏమీ మూయించడం లేదని, దుకాణదార్లే స్వచ్ఛందంగా మూసేస్తున్నారని చెప్పారు. మద్యం దుకాణాల నిర్వహణ, చిరు వ్యాపారులపై దౌర్జన్యం వంటివి తమ దృష్టికి రాలేదని, అయినా తమ సిబ్బంది తీరు మార్చుకోవాలని చెబుతామని అన్నారు.

➡️