నేటి నుంచి నామినేషన్లు

Apr 17,2024 22:07

25 వరకు గడువు

26న పరిశీలన

29న ఉపసంహరణ

మే 13న పోలింగ్‌

జూన్‌ 4న ఓట్లలెక్కింపు, ఫలితాలు వెల్లడి

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సాధారణ ఎన్నికల ప్రక్రియలో అతిముఖ్యమైన ఘట్టం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. సెలవు రోజుల్లో మినహా మిగిలిన పనిదినాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు అందజేయవచ్చు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా గురువారం విడుదల కానుంది. దీని ప్రకారం ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న పోలింగ్‌ ఉంటాయి. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థుల నామినేషన్లను విజయనగరం కలెక్టరేట్‌లోనూ, అరకు పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లోనూ స్థానిక కలెక్టర్లు (జిల్లా ఎన్నికల అధికారులు) స్వీకరించనున్నారు. శాసనసభ అభ్యర్థుల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లోని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. విజయనగరం, పార్వతీపురం మన్యం అసెంబ్లీ అభ్యర్థుల నుంచి ఆయా మండల తహశీల్దార్‌ కార్యాలయాల్లో సంబంధిత జిల్లా జాయింట్‌ కలెక్టర్లు స్వీకరించనున్నారు. కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్ల పత్రాలకు సంబంధించి తప్పుపొప్పులను సరిచచేసుకోవచ్చు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే రీతిలో హెల్ప్‌డెస్కులు ఉంటాయి. నామినేషన్ల స్వీకరణ, పరిశీలనకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు. నామినేషన్ల స్వీకరణ నుంచి సంబంధిత అభ్యర్థుల ఖర్చును లెక్కిస్తారు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఒక అభ్యర్ధి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధితో పాటు మరో నలుగురిని మాత్రమే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు అనుమతి ఇస్తారు. మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపివేస్తారు. అభ్యర్ధితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్ధులు పార్లమెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్ధులు ప్రవేశించే ద్వారాల వద్దా సిసి కెమేరాలను ఏర్పాటు చేసి, ఈ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేస్తారు. మోడల్‌ కోడ్‌ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్‌ చేస్తారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు- అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.- పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఎ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి. – నోటిఫైడ్‌ తేదీలలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.- పబ్లిక్‌ సెలవు దినాలలో నామినేషన్‌ స్వీకరించరు.- పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధులు ఫారమ్‌ 2ఎ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారమ్‌ 2బిలో ధరఖాస్తు చేయాలి.- అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్‌ దాఖలు చేయవచ్చు.- నామినేషన్లను ఆర్‌ఒకు గానీ, సంబంధిత ఎఆర్‌ఒకు మాత్రమే సమర్పించాలి.- అభ్యర్ది తన నామినేషన్‌ను నేరుగా గానీ, తన ప్రపోజర్‌ ద్వారా గానీ సమర్పించవచ్చు.- అభ్యర్ధి నామినేషన్‌తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి.- 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను వేయడం కుదరదు. – నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. – అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్‌ డెస్క్‌ లు ఏర్పాటు చేశారు. – సువిధ యాప్‌ ద్వారా నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వాటి కాపీలను భౌతికంగా ఆఒకు అందజేయాల్సి ఉంటుంది.- ఫారమ్‌-26 ద్వారా తన అఫడవిట్‌ను సమర్పించాలి.- అభ్యర్థి నామినేషన్‌ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు.- పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు

– 18 న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ

– నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్‌ 25-

నామినేషన్ల పరిశీలన 26న

– నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 29

– పోలింగ్‌ జరిగే తేదీ మే 13

– ఓట్ల లెక్కింపు జూన్‌ 4

– ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ జూన్‌ 6.

విజయనగరం జిల్లా రిటర్నింగ్‌ అధికారులు

విజయనగరం పార్లమెంటు స్థానం : కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి

ఎఆర్‌ఒ : కెఆర్‌సి ఎస్‌డిసి ఎం.సుమబాల

విజయనగరం అసెంబ్లీ స్థానం : జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌

చీపురుపల్లి : ఆర్‌డిఒ బి.శాంతి

రాజాం : ఎస్‌డిసి ఎల్‌జోసెఫ్‌

బొబ్బిలి : ఆర్డఇఒ ఎ.సాయి శ్రీ

గజపతినగరం : ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ

నెల్లిమర్ల : ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎం.నూకరాజు

ఎస్‌.కోట : ఎస్‌డిసి పి.మురళీకృష్ణ

పార్వతీపురం మన్యం జిల్లా రిటర్నింగ్‌ అధికారులు

అరకు పార్లమెంట్‌ స్థానం : కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పాలకొండ : సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి

సాలూరు : పార్వతీపురం ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌

పార్వతీపురం : ఆర్‌డిఒ కె.హేమలత

కురుపాం : ఆర్‌డిఒ వి.వెంకటరమణ

పాడేరు : జెసి భావన వశిస్ట్‌

అరకు : పాడేరు ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌

రంపచోడవరం : : సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌

ఏర్పాట్లు పూర్తి చేశాం

జిల్లాలో నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్‌ చేస్తాం. సిసి కెమేరాలు ఉన్న గదిలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తాం. నిర్ణీత సమయం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు మాత్రమే నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్ల ప్రక్రియ జరగదు. పోటీ చేయబోయే అభ్యర్ధులంతా ఖచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ, తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయాలి.- నాగలక్ష్మి, జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం

➡️