పోరాటం మేరకు నిధులు మంజూరు

Jun 18,2024 22:34

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : కాలుష్యంతో బాధపడుతున్న విటిపిఎస్‌ పరిసర ప్రాంత ప్రజల సమస్యలపై పోరాట సమితి సభ్యులు విటిపిఎస్‌ ప్రతినిధులతో చర్చించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో మంగళవారం పలు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు విటిపిఎస్‌ కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులు, విటిపిఎస్‌ అధికారులు వివరాలు వెల్లడించారు. విటిపిఎస్‌ కాలుష్య నియంత్రణ పోరాట సమితి పోరాటం వల్ల విటిపిఎస్‌ నుంచి సిఎస్‌ఆర్‌ నిధులు 4 కోట్ల రూపాయలు సాధించారన్నారు. రూ.4 కోట్లతో ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు రూ.30 లక్షల మొక్కలు నాటడానికి మంజూరు చేశారు. రూ.10 లక్షల వ్యయంతో మెడికల్‌ క్యాంపుల నిర్వహణకు కేటాయించారు. సమావేశంలో పోరాట సమితి వారు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే వారి ముందు మరికొన్ని డిమాండ్లను ఉంచిందని పోరాట సమితి సభ్యులు తెలిపారు. మెడికల్‌ క్యాంపులు కాదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ కట్టించాలి అనే ప్రధాన డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. రహదారులకు ఇరువైపులా 12-15 అడుగుల మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు పరిరక్షించాలని సూచించామన్నారు. మొక్కలు పెరిగే విధంగా ఫెన్సింగ్‌ వెయ్యాలన్నారు. రైతులకు పొలాల్లో గట్ల మీద పెంచడానికి ఫ్రీ గా మొక్కలు ఇవ్వాలని డిమాండ్‌ చేశామన్నారు. ప్రతి పాఠశాలలో మొక్కలు నాటించాలని, ప్రభుత్వ, ప్రవైట్‌ కార్యాలయాల్లో మొక్కలు విరివిగా నాటించాలని, ఇంటి ఇంటికి మొక్కలు ఉచితంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. బూడిద చెరువు దగ్గర భద్రతా దళాలని పెంచాలని, ప్లాంట్‌ రీపేర్‌ చేయిస్తే గాలి కాలుష్యాన్ని కొంత మేర అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ప్లాంట్‌ నుండి వచ్చే కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించాలని తాము డిమాండ్‌ చేశామన్నారు. సిఎస్‌ఆర్‌ నిధులు రూ.30 కోట్లు రావాలని, అవి వచ్చే వరకు కాలుష్యం నియంత్రణ పోరాటం ఆగదని స్పష్టం చేశామని గుర్తు చేశారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసినట్లు సభ్యులు తెలిపారు. నిధులు మంజూరు కార్యక్రమంలో ఎంపిడిఒ, ఎంపిపి విటిపిఎస్‌ అధికారులు, పరిసర ప్రాంత ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

➡️