పైపులైన్లు మార్చాల్సిందే

Jun 27,2024 00:45 #changed, #The pipelines
  • ‘మరిన్ని జగ్గయ్యపేటలు’పై అధికారుల వివరణ
  • విజయవాడలో 50 కి.మీ మేర దెబ్బతిన్నాయి
  • గుంటూరులో 32 కి.మీ ఇదే దుస్థితి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆసియాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పైపులైన్లను మార్చితేనే పట్టణ ప్రాంతాల్లో ప్రజానీకానికి రక్షిత మంచినీరు అందుతుందని, నీటి కాలుష్యం నుండి రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు. ‘మరిన్ని జగ్గయ్యపేటలు’ శీర్షికతో బుధవారం ప్రజాశక్తి మొదటిపేజీలో ప్రచురితమైన కథనంపై పట్టణాభివృద్ధిశాఖకు చెందిన పలువురు అధికారులు స్పందించారు. పైపులైన్ల నాణ్యతకు సంబంధించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించడంతో పాటు, మార్చడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఏడునుండి ఎనిమిది లేఖలు అందచేసినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయినా స్పందన కనిపించలేదని వివరించారు. ప్రస్తుతం 22 మున్సిపాలిటీల్లో పైపులైన్లు చాలా వరకూ దెబ్బతిన్నాట్లు మరో అధికారి చెప్పారు. గతంలో ఉన్న పైపులైన్లను సరిచేయకుండా, పగిలిన చోట్ల రిపేర్లు చేయకుండా అనేక ప్రాంతాల్లో అలాగే రోడ్లు వేసేశారని తెలిపారు. దీంతో భూమి లోపల గుంటలు ఏర్పడి మురుగు నీరు చేరి, పైపులైన్ల ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోందని వివరించారు. విజయవాడ నగరంలో కనీసం 50 కిలీమీటర్ల కిలోమీటర్ల మేర పైపులైన్‌ మార్చాల్సి ఉంటుందని, గుంటూరులో 32 కి.మీలలో పైపు లైన్లు దెబ్బతిన్నాయని వివరించారు. అన్ని పాత మున్సిపాల్టీల్లోనూ పైపు లైన్లు మార్చాల్సిఉంటుందని మరో అధికారి చెప్పారు.

కన్సల్టెన్సీలతో ఇబ్బందులు
ప్రస్తుతం నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కన్సల్టెన్సీలు ఇచ్చిన రిపోర్టులు అధారంగా పనిచేసే ఇంజనీర్లు తప్ప పైపులైన్లపై అవగాహన ఉన్న సిబ్బంది దాదాపు తగ్గిపోయినట్లు చెబుతున్నారు. ఎక్కడైనా పైపులైను లీకేజీ అయితే అది ఏ ప్రాంతం నుండి వస్తుందనేది పాత సిబ్బంది చూసి చెప్పేవారు. ప్రస్తుతం ఇంజనీర్లకు దీనిపై అవగాహన లేదు. అత్యసవర సమయాల్లో రిటైరైన అధికారులను పిలిపించి ప్లాను వేయిస్తున్నారు. దీంతో ఎక్కడైనా పైపు రిపేరు వస్తే దాన్ని సరిచేయడానికి మూడు నుండి నాలుగు రోజులు పడుతున్నట్లు సమాచారం. మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో సిమెంటు రోడ్ల అడుగుభాగంలో మురుగునీరు ప్రవహరిస్తోందని, ఇది పైపులైన్లను దెబ్బతీస్తోందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. సిమెంటు రోడ్లు ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ పోతుండటంతో గతంలో వేసిన వైపులైన్లు అనేక చోట్ల చాలా లోతుకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. సమస్య పెరగడానికి ప్రధాన కారణమని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

➡️