అయ్యో.. కాంట్రాక్ట్‌ అధ్యాపకులు..!

  •  నేటికీ విడుదల కాని రెన్యువల్‌ ఉత్తర్వులు
  •  2 నెలలుగా జీతాలు లేక అవస్థలు
  •  రాష్ట్ర వ్యాప్తంగా 4,369 అధ్యాపకుల పరిస్థితి అయోమయం
  •  గత ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిన రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : రాష్ట్రంలో డిగ్రీ, ఇంటర్‌ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల (లెక్చరర్స్‌)ను చూసి అయ్యో పాపం అనే పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా జీతాలు లేక, 2024-25 సంవత్సరానికి సంబంధించి పొడిగింపు (రెన్యువల్‌) ఉత్తర్వులు విడుదల కాక దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులను కలిసినా పట్టించుకోకపోవడంతో విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో పిల్లల చదువులు, ఇల్లు ఎలా గడపాలో తెలియక ఆర్థికంగా నలిగిపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 740 ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 3,629 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పనిచేస్తుండగా రెగ్యులర్‌ అధ్యాపకులుగా కేవలం 1200 మంది మాత్రమే ఉన్నారు. అంటే 67 శాతం కాంట్రాక్ట్‌ అధ్యాపకులే విద్యాభోదన చేస్తున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలో 19 ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల్లో 90 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు ఉండగా, 200 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని 173 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 680 మంది కాంట్రాక్టర్‌ అధ్యాపకులు విద్యాభోదన చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 16 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 62 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. కాంట్రాక్ట్‌ అధ్యాపకులు లేనిదే కళాశాలలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ వారి పట్ల చిన్నచూపు చూస్తున్న పరిస్థితి ఉంది. 20 ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా పని చేస్తున్నా ప్రతియేటా రెన్యువల్‌ ఉత్తర్వుల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఒక ఏడాది పది నెలలు, మరో ఏడాది 11 నెలలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. దీనిపై అనేక పోరాటాలు చేయగా 2019లో అప్పటి టిడిపి ప్రభుత్వం అధ్యాపకులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు చేస్తూ ప్రతియేటా పది రోజుల విరామంతో 12 నెలలు జీతాలు ఇచ్చేలా జిఒ ఇచ్చింది. ఆ వెంటనే ఎన్నికలు రావడంతో అమలు చేయకుండానే టిడిపి ప్రభుత్వం దిగిపోయింది. తరువాత గద్దెనెక్కిన వైసిపి ప్రభుత్వం కొద్ది నెలల తర్వాత ఆ జిఒను అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి ఒక్క ఏడాది మాత్రమే అమలు చేసింది. ఆ తర్వాత పది, 11 నెలలకు జీతాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వసాగింది. కాంట్రాక్ట్‌ అధ్యాపక యూనియన్ల పోరాటంతో పది రోజుల విరామంతో 12 నెలలు జీతం ఇచ్చేలా చేసుకున్నారు. ఇంటర్‌మీడియట్‌, డిగ్రీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు 2023-24 విద్యా సంవత్సరంలో 11 నెలలకు రెన్యువల్‌ ఇచ్చి మే నెలలో ‘నో వర్క్‌.. నో పే’ అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్‌ అధ్యాపకులు మే నెల జీతం నష్టపోయి ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఇంటర్మీడియట్‌ అధ్యాపకులు మాత్రం మే నెలలోనూ పరీక్షలు తప్పిన విద్యార్ధులకు పాఠాలు చెప్పారు. జూన్‌ ఒకటోతేదీన ఇంటర్‌ కళాశాలలు పున్ణప్రారంభం కావడంతో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు కళాశాలలకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఆయా యూనివర్సిటీల పరిధిని బట్టి జూన్‌ ఆరో తేదీ నుంచి 12వ తేదీలోపు ప్రారంభం కావడంతో వారు పాఠాలు బోధిస్తున్నారు. కళాశాలకు వెళ్లి పనిచేస్తున్నా రెన్యువల్‌ ఉత్తర్వులు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో జులై నెలలోనూ జీతం వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రెన్యువల్‌ ఉత్తర్వులు ఇస్తే జులై మొదటి వారంలో అయినా జీతాలు అందుకోవచ్చని అంతా ఎదురుచూస్తున్నారు.

గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌ అంటూ కాలయాపన
గత ప్రభుత్వం అక్టోబర్‌లో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌పై మొదట కేబినెట్లో ఆమోదం తెలిపి, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి, గవర్నర్‌కి పంపి, గెజిట్‌ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత జిఒ 114 విడుదల చేసింది. 20 ఏళ్లకు తమ కష్టాలు తీరుతున్నాయని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఆశగా ఎదురు చూశారు. కానీ జిఒ ఇచ్చి, రెగ్యులర్‌ చేయకుండానే వైసిపి ప్రభుత్వం దిగిపోయింది. కాంట్రాక్ట్‌ అధ్యాపకుల ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఈ సమస్యపై దఅష్టి పెట్టి కళాశాలల బోధనలో కీలక భూమిక పోషిస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకుని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

కాంట్రాక్ట్‌ అధ్యాపకుల బాధలు పట్టించుకోండి : బి.జె.గాంధీ, గవర్నమెంట్‌ కాలేజ్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోషియేషన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ
ఇప్పటి వరకూ కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు రెన్యువల్‌ ఉత్తర్వులు ఇవ్వలేదు. అడిగినా అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే రెన్యువల్‌ ఉత్తర్వులు ఇవ్వాలి. గత ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిన రెగ్యులైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి కాంట్రాక్ట్‌ అధ్యాపకులు న్యాయం చేయాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

➡️