21, 22 తేదీల్లో ఇండియన్‌ స్టార్టప్స్‌పై అంతర్జాతీయ సదస్సు

Jun 19,2024 22:02

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : కాకరపర్తి భావనారాయణ కళాశాల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజమెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ‘ఇండియన్‌ స్టార్టప్స్‌ – సమస్యలు – సవాళ్లు – అవకాశాలు’ అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు చెప్పారు. ఈ సందర్భంగా ఆ కళాశాల కమిటీ కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ పారిశ్రామిక రంగ అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం స్టార్టప్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతలోని నూతన ఆలోచనలకు ప్రొత్సాహాన్ని అందించి పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేసే దిశగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. ఆ క్రమంలో స్టార్టప్స్‌కు సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. తద్వారా పారిశ్రామిక రంగానికి యువత అభ్యున్నతికి మేలు జరగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సకు సంబంధించి 21న జరిగే ప్రారంభ సభకు స్థానిక శాసనసభ్యుడు, మాజీ కేంద్రమంత్రి వై.సత్యనారాయణ (సుజనా) చౌదరి ముఖ్యఅతిథిగా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ సదరన్‌ రీజనల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఆచార్య బి.సుధాకర్‌రెడ్డి గౌరవాతిథిగా హాజరవుతారన్నారు. మలేషియాకు చెందిన ఏసియన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఆచార్యులు ఆచార్య షరన్‌కుమర్‌షెట్టి కీలకపోన్యాసకునిగా, యుఎస్‌ఏకు చెందిన ఆచార్య సత్యనారాయణ పరియిటమ్‌ ప్రధాన వక్తగా పలు విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక సంస్థలకు చెందిన ప్రముఖులు వక్తలుగా హాజరవుతారని వివరించారు. రెండో రోజు జరిగే ముగింపు సభకు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యాశాఖ రెగ్యులేటరీ అండ్‌ మోనిటరింగ్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ అండ్‌ సిఇఒ ఆచార్య డి.సూర్యచంద్రరావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పీఎల్‌ రమేష్‌, పీజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేష్‌, అధ్యాపకులు హేమంత్‌ కుమార్‌, అరుణ్‌కుమార్‌, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️