‘ఉపాధి’ బకాయిలను చెల్లించాలి : కోట కళ్యాణ్‌

Jun 18,2024 22:35

విజయవాడ : జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సమస్యలను పరిష్కరించాలని అడిగిన వారికి వెంటనే పనులు కల్పించాలని వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఎన్టీఆర్‌ జిల్లా పీడీకి వినతిపత్రం సమర్పించారు. కొన్ని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పలు మండలాలు, గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం దృష్టికి వచ్చిన సమస్యలను వినతిపత్రం రూపంలో అందజేసినట్లు తెలిపారు. ప్రధానంగా చందర్లపాడు మండలం చందర్లపాడులో ఉపాధి హామీ పనులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాలో వేతన బకాయిలు నాలుగు నుంచి ఐదు వారాలు ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని కష్టపడి పనిచేసిన రోజు వేతనం రూ.270కు మించట్లేదని కూలి పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మస్టర్లు పని ప్రదేశంలో వెయ్యాలని మస్టర్‌ సీట్లు మేట్లకు అందుబాటులో ఉంచాలని పనిముట్లు ఇవ్వాలని మంచినీరు ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు పలుగు పారలకు డబ్బులివ్వలేదని ఆయన అన్నారు. అధికారులు జోక్యం చేసుకుని ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా అమలు జరిగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యం.సోమేశ్వరావు, టి.నరసిహరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️