Apr 8,2024 21:33

ప్రజల పక్షా పోరాడుతున్న సిపిఎంకు మద్దతివ్వాలి31వ డివిజన్‌ పాదయాత్రలో సిహెచ్‌.బాబూరావుప్రజాశక్తి – విజయవాడ : ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా టిడిపి బిజెపితో జతకడితే, వైసిపి బిజెపికి తొత్తుగా మారిందని, ఇటువంటి స్థితిలో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పోరాడుతున్న సిపిఎం, కమ్యూనిస్టులకు సెంట్రల్‌ నియోజకవర్గంలోని ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. విజయవాడ 31వ డివిజన్‌ శ్రీనగర్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, ముత్యాలంపాడు, కాలువకట్ట తదితర ప్రాంతాల్లో జరిగిన ‘మార్పు కోసం సి.పి.ఎం’ పాదయాత్ర, ఇంటింటి ప్రచారంలో బాబూరావు, సిపిఎం నేతలు పాల్గొని సోమవారం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వివిధ వర్గాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తున్న బిజెపి, మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలని ఘంటాపదంగా తెలిపారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాల దుష్ట విధానాల వల్ల విజయవాడ నగర ప్రజల ఆర్థిక స్థితిగతులు దిగజారిపోయాయన్నారు. రాజధాని అమరావతిని మోడీ, జగన్‌ చిన్నాభిన్నం చేశారని, విజయవాడ నగరాన్ని అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు దెబ్బ తిన్నారన్నారు. రైల్వే కూడలి అయినా విజయవాడలో రైల్వే స్టేషన్‌ను 99 సంవత్సరాలు లీజు పేరుతో తెగ నమ్ముతున్నారని దుయ్యబట్టారు. అంతేగాక రైల్వే ఉద్యోగుల సంఖ్యను కుదించారని అన్నారు. డి మార్ట్‌, రిలయన్స్‌ తదితర బడా కార్పొరేట్‌ కంపెనీలను ప్రోత్సహించి వ్యాపార రంగాన్ని దెబ్బతీశారన్నారు. చిన్నా మధ్యతరగతి వ్యాపారులు కుదేలయిపోయారని విమర్శించారు. భవన నిర్మాణం రంగం స్తంభించింది, కొత్త నిర్మాణాలు సాగటం లేదు, కార్మికులకు ఉపాధి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా రంగం అస్తవ్యస్తమయ్యిందన్నారు.. ఆటోనగర్‌ బోసిపోతుందన్నారు. కార్మికులు పనులు లేక అల్లాడుతున్నారని అన్నారు. లారీ, మోటార్‌ రంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు. నగరంలోని లారీ ఆపరేటర్లు కోలుకోలేని దెబ్బ తిన్నారన్నారు. రవాణా రంగంలో పన్నుల పెంపు, భారీ పెనాల్టీలు, పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెంపుదలతో అస్తబిస్తుగా ఉన్న ఈ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అసంఘటిత కార్మికులకు పనులు లేవు, ఆదాయం పడిపోయిందన్నారు. వేతనాలు పెరగలేదని, కార్మిక సంక్షేమ పథకాలు రద్దయ్యాయన్నారు. పన్నులు భారాలు, ధరలు పెరిగిపోయి జీవనం కష్టంగా మారిందన్నారు. కొత్త పరిశ్రమ లేదు, కొత్త సంస్థ ప్రారంభం కాలేదు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, వలసలు వెళ్ళిపోతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సి.పి.ఎం, కమ్యూనిస్టులు అటు కేంద్రం పైన, ఇటు రాష్ట్రం పైనపోరాడుతున్నాయని అన్నారు. మోడీ, జగన్‌ ప్రభుత్వాల దుర్మార్గాలను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్రంలో వైసిపితో పాటు, కేంద్రంలో మోడీ గద్దె దిగాలని ప్రజల ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఈ పాదయాత్రలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి.రమణరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, నాయకులు టి. ప్రవీణ్‌, మోతి, నాగరాజు,కళ్యాణ్‌, సుప్రజ, శివ, ఏ.వెంకటేశ్వరరావు,పీరు తదితరులు పాల్గొన్నారు.

➡️