జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారణ

Jun 19,2024 21:59
  • డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎస్‌.ఎ.వి.ప్రసాదరావు

ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 8వేల మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నారని ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ ఎస్‌ఎవి.ప్రసాదరావు సూచించారు. ది కృష్ణ డిస్ట్రిక్ట్‌ ఆటో ఫైనాన్షియర్స్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా సున్నపు బట్టీల సెంటర్లోని అమ్మ కళ్యాణమండపంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎస్‌ఎవి.ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్‌ ఆటో ఫైనాన్షియర్స్‌ అసోసియేషన్‌ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. హెల్మెట్‌ వాడకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అయితే ప్రజలెవరూ హెల్మెట్లను ధరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాల భారి నుంచి తప్పించుకోగలరని సూచించారు. అనంతరం ట్రాఫిక్‌ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.ప్రసాద్‌ మాట్లాడుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫైనాన్స్‌ కంపెనీల వలన నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతోందని తద్వారా ట్రాఫిక్‌ సమస్య జట్టిలమవుతోందని తెలిపారు. పిల్లలకు వాహనాలు కొనిచ్చే విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్నేక్‌ డ్రైవింగ్‌ వల్ల యువత ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. పాదచారులు తప్పనిసరిగా ఫుట్‌పాత్‌పై నడవాలని అన్నారు. అనంతరం ది కృష్ణా డిస్ట్రిక్ట్‌ ఆటో ఫైనాన్షియర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జయప్రకాశ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ తమ అసోసియేషన్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని ఉచిత వైద్య సేవలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. ఈ నెల 22న మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో తమ అసోసియేషన్‌ స్వర్ణోత్సవ వేడుకలు జరగనున్నాయని ఈ వేడుకలకు జాతీయ అసోసియేషన్‌ ప్రతినిధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ కమిటీ చైర్మన్‌ విజికే ప్రసాద్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సిహెచ్‌ రాధాకష్ణతదితరులు పాల్గొన్నారు.

➡️