ఈ రహదారులకు మోక్షం ఎప్పుడో !

May 18,2024 19:21

ప్రజాశక్తి – మైలవరం : మైలవరం, నూజివీడు ప్రధాన రహదారి గోతులమయంగా తయారై ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. మైలవరం, నూజివీడు, గణపవరం మార్గంలో అనునిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఆటోవాలాలు, ద్విచక్ర వాహనదారులు గోతుల్లోకి దిగటంతో ఆ కుదుపులకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మైలవరం బైపాస్‌ రింగు చంద్రబాబు నగర్‌ నుండి నూజివీడు, గణపవరం విజయవాడ రోడ్డు భారీ వాహన రాకపోకల కారణంగా పూర్తిగా అధ్వానంగా తయారైంది. ఈ మార్గాల్లో రోడ్లపై గోతుల కారణంగా తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు హరిస్తున్నా పట్టించుకోరా అంటూ ఆర్‌అండ్‌బి అధికారులపై వాహనదారులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా అని ప్రశ్నిస్తున్నారు. మైలవరం బైపాస్‌ రింగు వద్ద రోడ్డుపై తారు, కంకర లేచిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. గోతిలో పడి కొందరు గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. రోడ్డు మధ్యలో గొయ్యి ఉండటంతో ట్రాఫిక్‌ నియంత్రణ లేక వాహనదారులు రాంగ్‌ రూటులో వెళ్లి ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. వెంటనే ధ్వంసమైన రహదారులకు మరమ్మత్తులు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

➡️