నేడు వీరి నామినేషన్లు

Apr 18,2024 22:25

ఇండియా వేదిక బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. స్థానిక లెనిన్‌ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌, సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు నామినేషన్‌ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించాలని కోరారు. జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు కెఎల్‌.రావు పార్క్‌ వద్ద నుంచి ప్రారంభమవుతుందని పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, రమణారావు తదితరులు పాల్గొన్నారు.భవానీపురం : వైసిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భవానీపురంలోని నియోజకవర్గ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఆసిఫ్‌ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8 గంటలకు పంజా సెంటర్‌ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎమ్మార్వో కార్యాలయం సమీపం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ ఎన్నికల పరిశీలకులు గుబ్బ చంద్రశేఖర్‌, పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

➡️