కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

Dec 25,2023 14:41 #Anganwadi strike, #Kakinada

ప్రజాశక్తి-పిఠాపురం(కాకినాడ) : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 14వ రోజుకి చేరింది. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్దకు వచ్చి సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కె విశ్వనాథం, కుంచే చిన్న, జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్‌ టి.ఉదరు శ్రీనివాసులు తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. పండగ రోజుల్లో కూడా పస్తులు ఉంచడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్పు చేయాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసి,నళిని,అమల,భవాని, తదితరులు పాల్గొన్నారు.

➡️