ఓ(పో)టెత్తారు

May 13,2024 23:17

విజయనగరం జిల్లాలో 78.20శాతం

మన్యం జిల్లాలో 63.51శాతం పోలింగ్‌

తొలుత మందకొడి … ఆ తరువాత వేగవంతం

పలుచోట్ల రాత్రి వరకు పోలింగ్‌

వర్షం, విద్యుత్‌ అంతరాయంతో అవస్థలు

కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలు

పిఎస్‌ఆర్‌ పురంలో పిఒపై వైసిపి ఏజెంట్ల దాడి

కొన్నిగ్రామాల్లో చెదురుమదురు సంఘటనలు

వడదెబ్బకు ఇద్దరు ఓటర్లు మృతి

రాజాంలో సొమ్మసిల్లిన పోలింగ్‌ సిబ్బంది

పోలింగ్‌ను బహిష్కరించిన భోజరాజుపురం గ్రామస్తులు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : గడిచిన రెండు దఫాలుగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది. ప్రజలు తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించు కున్నారు. విజయనగరం జిల్లాలో 78.20 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో సాయంత్రం ఐదు గంటల వరకు 63.51 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ రెండు జిల్లాల్లోనూ ఉదయం 7గంటలకే చాలా చోట్ల ఓటర్లు క్యూలైన్‌లో బారులు తీరారు. ఎక్కువ చోట్ల ఇవిఎంలు మొరాయించడంతో ఉదయం 11గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా సాగింది. సరిచేయడానికి వీలు కాని కేంద్రాల్లో ఇవిఎంలను మార్పుచేశారు. ఆ తరువాత పోలింగ్‌ ఊపందుకుంది.

ఎస్‌.కోట, కొత్తవలస తదితర ప్రాంతాల్లో సాయంత్రం 6గంటల తరువాత ఓవైపు వర్షం కురవడం, మరోవైపు విద్యుత్‌ అంతరాయం ఏర్పడడంతో చాలాసేపు పోలింగ్‌ నిలిచి పోయింది. దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ కొన్ని గ్రామాల్లో రాత్రి 9గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. మెరక ముడిదాం మండలం ఉత్తరావల్లిలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడడంతో సాయంత్రం 6తరువాత కూడా పోలింగ్‌ కొనసాగింది. ఆయా కేంద్రాల్లో జనరేటర్లను ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడం వల్ల అటు సిబ్బంది, ఇటు ఓటర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనులు కొండలు, గుట్టలు, కాలువలు, నదులు దాటుకుని (మిగతా..3లో)మధ్యాహ్ననికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. సాలూరు మండలంలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాల ప్రజానీకం ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులకు, అంటే చొరో నాలుగు ఓట్ల చొప్పున వేశారు. చంటిపిల్లలను చంకనెత్తుకొని క్యూలైన్లలో నిల్చున్నారు. ఇందుకనుగుణంగా ఇరు రాష్ట్రాలకు చెందిన ఎన్నికల కమిషన్లు సమన్వయం చేసుకుని పోలింగ్‌ ఏర్పాటు చేశాయి. అక్కడ కూడా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. కొన్నిచోట్ల వీల్‌చైర్లు అందుబాటులో లేకపోవడం లేదా మరమ్మతులకు గురికావడంతో వృద్ధులు, వికలాంగులను తమ కుటుంబ సభ్యులు ఎత్తుకుని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లడం కనిపించింది. తమ గ్రామ అభివృద్ధి పట్టించుకోలేదన్న కోపంతో దత్తిరాజేరు మండలం గుచ్ఛిమి పంచాయతీ పరిధిలోని భోజరాజుపురం వాసులు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఎండవేడికి తట్టుకోలేక గుమ్మలక్ష్మీపురం మండలం పెద ఖర్జ గ్రామానికి చెందిన హిజ్రా బిడ్డిక రాజారావు (55, నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి గ్రామంలో వృద్ధురాలు పాలూరి పెంటమ్మ (65) మృత్యువాత పడ్డారు.
రాజాంలో పోలింగ్‌ నిర్వహణకు వచ్చిన ఓ ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోయాడు. వైద్యసేవలందించేందుకు ఆయనను హుటాహుటిన విజయనగరం తరలించారు. గజపతినగరం మండలం పాత శ్రీరంగరాజ పురంలో తలెత్తిన వివాదంలో వైసిపికి చెందిన పోలింగ్‌ ఏజెంట్లు పోలింగ్‌ ఆఫీసర్‌పై దాడికి పాల్పడ్డారు. ఉదయం 10:30గంటల సమయంలో గుర్ల మండలం బంటుపల్లిలో వైసిపి, టిడిపిలకు చెందిన నాయకుల మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్త పరిస్థితికి దారితీయడంతో సుమారు గంటపాటు పోలింగ్‌ నిలిపివేశారు. దత్తిరాజేరు మండలం విద్యావాసి కృష్ణాపురంలో ఇరు పార్టీలకు చెందిన నాయకుల మధ్య పెనుగులాటలో పలువురికి గాయాలయ్యాయి. బొబ్బిలి మండలం చింతాడ, అలజంగి సహా జిల్లాలోని చాలా గ్రామాల్లో టిడిపి, వైసిపి నాయకులు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.
ఓ(పో)టెత్తారు
బొబ్బిలి మండలం పక్కిలో టిడిపి ఏజెంట్‌పై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్‌ సిబ్బందికి భోజన ఏర్పాట్లు స్థానిక బిఎల్‌ఒలకు చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో, నాణ్యమైన భోజనాలు అందలేదని పోలింగ్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. రెండు జిల్లాల ఎన్నికల అధికారులు ఎస్‌.నాగలక్ష్మి, నిశాంత్‌కుమార్‌ కంట్రోల్‌ రూమ్‌ల నుంచి పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించారు. పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని డిఐజి విశాల్‌ గున్నీ తనిఖీ చేశారు. ఎన్నికల పరిశీలకులు తలేత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రాజాంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఇరు జిల్లాల ఎస్‌పిలు ఎన్నికల పరిశీలకులు పలు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని పోలింగ్‌ సరళిని సమీక్షించారు. రండు జిల్లాల్లోనూ దాదాపు వైసిపి, టిడిపి, సిపిఎం, కాంగ్రెస్‌ తదితర పార్టీల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, రాజకీయ ప్రముఖలు, కలెక్టర్‌, ఎస్‌పి, జెసి వంటి ఉన్నతాధికారులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే ఇవిఎంలను పటిష్ట పోలీసుల భద్రత నడుమ విజయనగరంలోని జెఎన్‌టియు, లెండీ కాలజీలకు తరలించారు. ఇదీ ఓటింగ్‌ సరళి విజయనగరం జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఉదయం 7గంటలకే పోలింగ్‌ ప్రారంభించినప్పటికీ చాలా చోట్ల ఇవిఎంలు మొరాయించాయి. దీంతో, 9గంటల వరకు కేవలం 10.28 శాతం ఓటింగ్‌ మాత్రమే జరిగింది. ఆ తరువాత ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేందుకు ఓటర్లు సాహశించలేకపోయారు. దీంతో, 11గంటల సమయానికి కూడా 22.79శాతం ఓటింగ్‌కు పరిమితమైంది. మధ్యాహ్నం 1గంటకు జిల్లాలో ఓటింగ్‌ 39.56 శాతానికి చేరింది. 3గంటలకు 51.71 శాతం, సాయంత్రం 4గంటలకు 60.13 శాతం, 6గంటలకు 73.02 శాతం ఓటింగ్‌ నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 9గంటలకి 6.53శాతం, 11గంటలకు 15.54శాతం, మధ్యాహ్నం 1గంటకి 34.98శాతం, 3గంటలకి 51.75శాతం, సాయంత్రం 5గంటలకి 63.51శాతం పోలింగ్‌ నమోదైంది.
➡️