సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల దృష్టి

పల్నాడు జిల్లా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల మార్చ్‌ఫాస్ట్‌

అదనపు భద్రతకు ప్రణాళికలు – కేంద్ర బలగాలతో గ్రామాల్లో ప్రదర్శనలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో గురటూరు,పల్నాడు జిల్లాల్లో సమస్యాత్మక గ్రామాలపై పోలీసు అధికా రులు దృష్టి సారించారు. ప్రధానంగా ఎన్నికలల్లో ఘర్షణలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతా లపై ప్రత్యేక నిఘా విధించాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోనే ఎక్కువ గ్రామాల్లో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. రాజుపాలెం మండలంలో అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై కూడా దాడి జరిగింది.ఆయన్ను కొంత సేపు పోలింగ్‌ బూత్‌లోనే బంధించిన ఘటన చోటుచే సుకుంది. మాచర్ల, గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 300 గ్రామాల్లో పరస్పర ఘర్షణలకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం పారా మిలటరీ దళాలను ఎక్కువగా వినియోగించేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళిక రూపొందించారు. పల్నాడు జిల్లాకు ఇప్పటికే పారా మిలటరీ బలగాలు చేరుకున్నాయి. వీరితో గ్రామాల్లో నిత్యం ఎదో ప్రాంతంలో మార్చ్‌ఫాస్టు నిర్వహిస్తు న్నారు. మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఘర్షణలు జరిగాయి. అయితే జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను టిడిపి బహిష్కరించడంతో చాలా గ్రామాల్లోపోటీ ఏకపక్షంగా ఉండటం వల్ల కొంత మేరకు ఘర్షణలు తగ్గాయి. కానీ కొన్ని గ్రామాల్లో జనసేన, వైసిపి మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కూటమి ఒక వైపు, వైసిపి మరో వైపు ఢ అంటే ఢ అంటున్నాయి. ఈనేపధ్యంలో 2019 కన్నా ఘర్షణలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో కూడా తాడికొండ, .పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు నియోజక వర్గాల్లో ఘర్షణలకు ఆస్కారం ఉంది. దీంతో మొత్తంగా పోలీసు అధికారులు సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించే పనిలో ఉన్నారు. అంతేగాక గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఘర్షణలకు ఆస్కారం ఉన్న గ్రామాల్లో ఎక్కువ మంది పోలీసులను బందోబస్తుకు నియమించాలని యోచిస్తున్నారు. ఇటీవల మాచర్లలో ఒక కారు దగ్ధం అయిన ఘటనపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. మూడు రోజుల క్రితం క్రోసూరులో టిడిపి కార్యాలయం తగులబెట్టడంపై అధికారులు సీరియస్‌గా తీసుకుని నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కారంపూడిలో ఒక పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలను టిడిపి తప్పుపట్టింది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పల్నాడు ఎస్‌పి బదిలీ నేపధ్యంలో కొత్త ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన గరికపాటి బిందుమాధవ్‌ జిల్లాలో శాంతిభద్రతలపై దృష్టి సారించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు పల్నాడు జిల్లా ఎస్‌పి బిందు మాధవ్‌ ఆధ్వర్యంలో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజలలో భరోసా కల్పించేందుకు , ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నట్టు ఎస్‌పి తెలిపారు.

➡️