హోదా మారినా అవే సమస్యలు

Jun 26,2024 23:06

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా నూతన కలెక్టరుగా ఎస్‌.నాగలక్ష్మీ బుధవారం ఉదయం 10.30 గంటలకు గుంటూరు కలెక్టరేట్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు. 2015 డిసెంబరు 7వ తేదీ నుంచి 2017 మే 12 వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన నాగలక్ష్మీ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో పలుశాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2022 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి వరకు అనంతపురం జిల్లా కలెక్టరుగా పనిచేశారు. ఆ తరువాత విజయనగరం కలెక్టరుగా బదిలీ అయ్యారు. విజయనగరం నుంచి బదిలీపై గుంటూరు కలెక్టరుగా వస్తున్నారు. నాగలకీë ఏడేళ్ల క్రితం గుంటూరు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో నెలకొన్న సమస్యలే తిరిగి ఇప్పుడు ఆమెకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా గుంటూరుకు తాగునీటిని, ప్రత్తిపాడు, పర్చూరు నియోజకవర్గాల్లో తాగునీరు, సాగునీరు అందించే గుంటూరు ఛానల్‌ విస్తరణ, పొడిగింపు పనులు ఇప్పటీకి ప్రారంభం కాలేదు. దశాబ్ధాల తరబడి ఈ సమస్య ప్రజలను వెంటాడుతోంది. ప్రత్తిపాడు, పర్చూరు నియోజకవర్గాల్లో 50 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ పథకం ఇప్పటి వరకు పాలకుల నిర్లక్ష్యం, అధికారులు అశ్రద్ధతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గుంటూరు ఛానల్‌కు సంబంధించి రూ.320 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. గుంటూరులో రూ.460 కోట్లతో చేపట్టిన సమగ్ర రక్షిత నీటిపథకం నాగలక్ష్మీ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే పనులు జరిగాయి. ఈ పథకం పూర్తయినా ఇప్పటికీ నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొనసాగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థలో విలీనం అయిన గ్రామాలకు తాగునీటి సరఫరానే సరిగా జరగడం లేదు. ఈ సమస్య ఏడేళ్లుగా కొనసాగుతోంది. గుంటూరులో రూ.930 కోట్లతో చేపట్టిన యూజిడిపనులు ఇంతవరకు పూర్తికాలేదు. నాగలక్ష్మీ కమిషనర్‌గా ఉండగా ఈపనులు అత్యంత వేగంగా జరిగినా ఆ తరువాత పనులు మందగించాయి. మూడేళ్లలో పూర్తి కావాల్సిన పనులు 2019 మార్చి నాటికి 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. టిడిపి హయాంలో రూ.550 కోట్ల మేరకు పనులు జరిగినట్టు అంచనా వేశారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనులనుపూర్తిగా నిలిపివేశారు. గత ఐదేళ్లుగా ఈ పనులు జరగకపోవడంతో ఈ పథకం అత్యంత నిరుపయోగంగా మారింది. దీనిని పూర్తి చేసేందుకు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు, కార్పొరేషన్‌ రూ.90 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఈ పథకాలకు ఈ నిధులు తెప్పించడం కలెక్టరుకు పెద్దసవాల్‌గా నిలవనుంది. మరోవైపు గుంటూరుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. గత ఐదేళ్లు గా రహదారులు, భవనాల శాఖకు నిధులు ఇవ్వకపోవడంతో చాలా వరకు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2016 సెప్టెంబరులో పుష్కరాల సందర్భంగా అప్పటి కమిషనర్‌గా నాగలక్ష్మీ గుంటూరు నుంచి జిల్లాలోని ప్రధాన మార్గాలకు వెళ్లే 12 రహదారుల విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆమె హయాంలో దాదాపు ఆరు రోడ్లు పూర్తయ్యాయి. ప్రధానంగా గుంటూరు- పలకలూరురోడ్డు విస్తరణ, నిర్మాణం పనులు పూర్తి కాలేదు. మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మూడోదశ నిర్మాణ పనులు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. గుంటూరులో పలు రైల్వే బ్రిడ్జిల నిర్మాణం, ఆర్‌యూబిల ప్రతిపాదనలు, గుంటూరు పివికే కూరగాయల మార్కెట్‌ నిర్మాణం కాగితాలకే పరిమితమ య్యాయి. ఈ ప్రతిపాదలన్నీ నాగలక్ష్మీ కమిష నర్‌గా ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌ ఎన్నికలు జరగలేదు. జిల్లాలో రేషన్‌ సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. రేషన్‌ బియ్యం యథేశ్చగా రైస్‌మిల్లులకు తరలిపోతున్నాయి. వీటిని రీ సైక్లింగ్‌ చేసి మిల్లర్లు విక్రయిస్తున్నారు. జిల్ల్లాలో రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారం భం కావడం, సచివాలయం, అసెంబ్లీ వెలగ పూడి నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభిం చడంతో రాజధాని జిల్లా కలెక్టరుగా నాగలక్ష్మీకి పని వత్తిడి, పాలన పరంగా అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. రాజధాని జిల్లా కేంద్రంగా గుంటూరు ఏ మాత్రమూ అభివృద్ధి జరగలేదని విమర్శలూ ఉన్నాయి.

➡️