స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కట్టుదిట్టంగా భద్రత

May 18,2024 15:11 #palnadu district

కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భధ్రతా ఏర్పాటు…
స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్…

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవిఎం, వివిప్యాట్ లు భధ్రపరచిన జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను శనివారం జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, అదనపు ఎస్పీ ఆర్.రాఘవేంద్ర ఆకస్మికంగా తనిఖీలు చేసి, భద్రతాపరమైన అంశాలలో సిబ్బందికి తగిన సూచనలు సలహాలు చేసి పలు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్బంగా సంబంధిత లాగ్ బుక్ లో సంతకాలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భధ్రతా విషయంలో ఈవిఎంలు, వివిప్యాట్ ల సురక్షిత తదితర అంశాలపై అదనపు ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామన్నారు. జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివిప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భధ్రపరచడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాలంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై అధనపు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ నేపద్యంలో రాజకీయ హింసకు సంబంధించిన ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా, సంయమనం పాటించడం అత్యంత కీలకమన్నారు. ఈ విషయంలో ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యహరించాలన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్బంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని అధికారికిలకు ముందస్తు సమాచారం అందించాలని కోరారు. అదే విధంగా జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూము వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ లో వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలలో మూడు అంచెల భద్రత ను ఏర్పాటు చేసి, సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు, స్ట్రాంగ్ రూమ్ చుట్టు పక్కల 144 సెక్షన్ అమలులో ఉన్నదని ప్రజలు ఎవరు సదరు కాలేజీ చుట్టుపక్కల సంచరించరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

➡️