ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి : సిపిఎం

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : జిల్లావ్యాప్తంగా ఉపాధి పెండింగ్‌ లో ఉన్న 8 వారాలు వేతనాలు చెల్లించాలని, రాజకీయ కారణాలతో ఉపాధి పనులు ఆపకూడదని, పనిముట్లు ప్లే స్లిప్పులు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దస్తగిరికి వినతి పత్రం అందించారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ …. జిల్లాలో రెక్కల కష్టం మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు ఉపాధి చట్టం ఒక వరం లాగా ఉన్నదని, ఈ చట్టం ద్వారా సుమారుగా 2.25 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని అన్నారు. రాజకీయ కారణాలతో ప్రస్తుతం 25 వేల కూలీలకు పనులు లేవన్నారు. ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. సమ్మర్‌ అలవెన్స్‌ ఎత్తివేయటం రెండు పూటల పని ఆన్‌లైన్‌ మాస్టర్‌ చేసిన పనులకు వేతనాలు చెల్లించకుండా నెలల తరబడి నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 8 వారాల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పనులు దగ్గర కనీసం సౌకర్యాలు నీడ నీళ్ళు మెడికల్‌ కిట్లు పనిముట్లు లేవని, కాబట్టి రాష్ట్రప్రభుత్వం ఉపాధి కూలీలను వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని కోరారు.

ఈ క్రింది సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ డిమాండ్‌ చేస్తున్నదన్నారు.

  1. పెండింగ్‌ లో ఉన్న 8 వారాల ఉపాధి వేతనాలు చెల్లించాలి
  2. ఉపాధి కూలీ కుటుంబ సభ్యులందరికీ బీమా సౌకర్యం కల్పించాలి
  3. అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలి
  4. రాజకీయ జోక్యం ఆపాలి
  5. 200 రోజులు పనులు రోజు కూలి 600 ఇవ్వాలి
  6. 100 రోజులు పనులు పూర్తిచేసిన కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదనంగా నూరు రోజులు ఉపాధి పనులు కల్పించాలి.
  7. చేసిన పనులకు వారం వారం వేతనాలు చెల్లించాలి
➡️