టిడిపి హామీలను ప్రజలు నమ్మరు

Apr 29,2024 23:30

పొన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి/పొన్నూరు :
ఎన్నికల ఇచ్చిన హామీలను విస్మరించి మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఇచ్చే హామీలను ప్రజలు విశ్వసించరని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. పొన్నూరులో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి పరిపాలన వ్యవస్థను ప్రజల ముగింటకు తెచ్చిన తనను బచ్చాతో పోల్చిన చంద్రబాబు నాయుడు సిఎంగా ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తాను రాష్ట్రంలో 50 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ఇస్తే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. 2014లో రైతుల రుణాలను మాఫీచేస్తానని తొలి సంతకం చేసి ఐదేళ్లు గడిచినా రుణమాఫీ చేయకుండా మోసం చేయలేదా అని ప్రశ్నించారు. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని మహిళలను అన్యాయం చేశారన్నారు. పేదలకు మూడు సెంట్లు స్థలం, పక్కా గృహ నిర్మాణం చేస్తామని, అన్ని నగరాల్లో హైటెక్‌ సిటీ నిర్మాణం చేస్తామని మాయమాటలు చెప్పి అమలు చేయకుండా నిరుద్యోగులకు మోసం చేశారన్నారు. 2014లో మాదిరిగానే మళ్లీ 2024లో టిడిపి, బిజెపి, జనసేన ముగ్గురూ జతకట్టి ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి జరగాలంటే బిజెపి, టిడిపి, జనసేన కూటమిని ఓడించాలని, వైసిపిని గెలిపించాలని కోరారు. ఎన్‌డిఎ కూటమి ఏర్పడి సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవన్‌ అంటూ అనేక హామీలు ఇస్తూ ప్రజలను మళ్లీ మోసగించాలని చూస్తున్నాయని విమర్శించారు. తాము ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు అమలుచేశామని, ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను చేర్చామని వివరించారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. అవినీతి రహితంగా తమ పరిపాలన సాగిందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయని విమర్శించారు. చంద్రబాబు ఏళ్ల పరిపాలనలో చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. అమలుకు వీలుకాని హామీలతో చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఆ శక్తులకు నచ్చడం లేదని దుయ్యబట్టారు. అనంతరం గుంటూరు వైసిపి పార్లమెంటు అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు వైసిపి అసెంబ్లీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణను సిఎం జగన్‌ ప్రజలకు పరిచయం చేసి ఎన్నికల్లో వారిని గెలిపించాలని కోరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి విడదల రజిని, గుంటూరు తూర్పు అభ్యర్థి నూరి ఫాతిమా, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ రూత్‌ రాణి, షేక్‌ షఫాయితుల్లా, షేక్‌ నాజర్‌ పాల్గొన్నారు.

➡️