ప్రజలు న్యాయం వైపు నిలబడాలి

ప్రజాశక్తి – వేంపల్లె / లింగాల సార్వత్రిక ఎన్నికల్లో న్యాయం వైపు కడప ప్రజలు నిలబడాలని పిసిసి ఛీప్‌, కడప కాంగ్రెసు ఎంపీ అభ్యర్థి షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని పాములూరు, అమ్మగారిపల్లె, అలవలపాడు గ్రామాలో వివేకా కుమార్తె సునీతా రెడ్డి, పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డితో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. రోడ్డుపైకి మహిళాలు పెద్ద ఎత్తున షర్మిలను చూడడానికి తరలి రావడంతో ఆమె వాహనం దిగి ప్రతి ఒక్కరిని ఆప్యా యంగా పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తున్నట్లు చెప్పారు. కడపలో న్యాయం గెలిస్తుందా, నేరం గెలుస్తోందా అనే దానిపై ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని చెప్పారు. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ మరో వైపు వివేకా హత్య నిందితుడు పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉన్నా కడప స్టీల్‌ గురించి పట్టించు కోలేదని చెప్పారు. కడప స్టీల్‌ వైఎస్‌ఆర్‌ కల అన్నారు. వివేకాకు కొడుకులు లేరని జగన్‌ను సొంత కొడుకులా చూశారని పేర్కొన్నారు. తండ్రి తర్వాత వివేకా తండ్రి అంతటి వాడని చెప్పారు. అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారని చెప్పారు. సిబిఐ కర్నూల్‌లో అవినాష్‌రెడ్డి అరెస్టు చేయాలని చూస్తే జగన్‌ కాపాడారని పేర్కొన్నారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఒక్క హామీ నెరవే రలేదని చెప్పారు. ఒకప్పుడు తాను అన్న జగన్‌ కోసం ఇళ్లు, వాకిలి, పిల్లలను వదిలి పెట్టీ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని చెప్పారు. ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డానని చెప్పారు. అనంతరం వివేకా కుమార్తె సునీతారెడ్డి మాట్లాడుతూ వివేకాను దారుణంగా హత్య చేశారని చెప్పారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం అవ్వొచ్చు కాని ప్రజా తీర్పు చాలా పెద్దది అన్నారు. ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని, న్యాయం నిలబడ్డారని, కాబట్టి ప్రజలందరూ ఆమెను ఆశ్వీర్వదిం చాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో వివేకా బావమర్ది శివప్రకాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ధవకుమార్‌ రెడ్డి, కాంగ్రెసు నాయకులు పాల్గొన్నారు. కొంగుచాచి అడుగుతున్నాం.. లింగాల : వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తెలమైన తాము కొంగుచాచి అడుగుతున్నాం కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కడప పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌. షర్మిల, సునీత మండల ప్రజలను అభ్యర్థించారు. మండలంలోని పార్నపల్లి కోమనూతల ఇగుపల్లి దిగువపల్లి మురారి చింతల గుణకణపల్లి తదితర గ్రామాల్లో రోడ్డుసో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ న్యాయానికి, అవినీతికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 30 ఏళ్లు సేవ చేశారని, వివేకా కూడా ఎన్నో మంచి పనులుచేశారని తెలిపారు. వివేకా హంతకులకు జగన్‌ టికెట్‌ ఇచ్చారని, ఐదేళ్లు గడిచినా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. పైగా జగన్‌ వివేకా హంతకులను కాపాడుతూ వస్తున్నారని పేర్కొన్నారు. ఇది ధర్మమా.. న్యాయమా, అందుకే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రోడ్‌ షో షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌, తులసిరెడ్డి, శివప్రకాష్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️