పురుగు మందు తాగి పిఇటి ఆత్మహత్య

Apr 18,2024 21:55

పోక్సో కేసు నమోదుతో దారుణం

 ప్రజాశక్తి-శృంగవరపుకోట  : లక్కవరపుకోటలోని ఓ ప్రైవేటు స్కూలులో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొత్తవలస మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన పాకలపాటి శ్రీనివాసరాజు (47) గురువారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలో ఆయన పిఈటిగా పనిచేస్తూ విద్యార్థులకు కరాటే లో శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఈనెల 13న మండల కేంద్రంలో ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్లు బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎల్‌.కోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆయనకు దేహశుద్ధి చేశారు. ఈ నేపధ్యంలో 14వ తేదీ ఉదయం శ్రీనివాసరాజు ఎస్‌.కోట ఆర్‌టిసి కాంప్లెక్సువద్ద పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిహెచ్‌సిలో చేర్పించారు. మరుచటిరోజు ఉదయం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరాజు గురువారం లక్కవరపుకోట సమీపాన విశాఖ అరకు రహదారిలో వాడుకలో లేని భవనం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని శంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి పార్వతీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో మనస్థాపం చెందిన తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పార్వతీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాసరాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజుకు ఎందుకు రక్షణగా లేరని పలువురు ప్రశ్నిస్తున్నారు.

➡️