ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఫోన్లను అనుమతించం : జెసి

May 24,2024 00:08

ప్రజాశక్తి – మంగళగిరి : ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మంగళగిరి అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే అభ్యర్థులకు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా సంయుక్త కలెక్టరు జి.రాజకుమారి గురువారం అవగాహన కల్పించారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జెసి మాట్లాడుతూ వచ్చేనెల 4వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ కాలేజీ సివిల్‌, మెకానికల్‌ బ్లాకు, రూమ్‌ నెంబరు-206, మొదటి అంతస్తులో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని, ఉదయం 6.30 గంటల కల్లా ప్రతి ఒక్కరూ కౌంటింగ్‌ హాలునకు చేరుకోవాలని చెప్పారు. మొబైల్‌ ఫోన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ హాల్‌లో కౌంటింగ్‌ సిబ్బందికి ఆటంకం కలిగించని, కౌంటింగ్‌ హాలు ప్రశాంతతకు భంగం కలిగించని విధంగా ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పారు. ఆర్‌వో కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూములో భద్రపరచిన పోస్టల్‌ బ్యాలెట్లను ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు అంటే 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. కౌంటింగ్‌ హాల్‌లో ఈవీఎం ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుకు 3 టేబుల్స్‌, ఇటిబిపిఎస్‌ లెక్కింపుకు ఒక టేబుల్‌ ను ఏర్పాటు చేశామని, టేబుల్‌ వారీగా కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పారు.

➡️