పోలింగ్‌ పటిష్టంగా నిర్వహించాలి

Apr 13,2024 21:19

 ప్రజాశక్తి – సాలూరు : పోలింగ్‌ పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకుని సమర్ధంగా విధులు నిర్వహించాలని ప్రిసైడింగ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాలూరు నియోజకవర్గ ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణ తదితర అంశాలపై అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తశుద్ధితో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని భావించి ఎటువంటి ఆరోపణలు లేకుండా స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్‌, సెక్టార్‌ అధికారులు కీలకమన్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు ఏమైనా అనుమానాలు ఉంటే శిక్షణలో పూర్తి స్థాయిలో నివృత్తి చేసుకోవాలని అన్నారు. మాక్‌ పోలింగ్‌ మొదలుకొని స్ట్రాంగ్‌ రూములో ఇవిఎంలు భద్రపరిచే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పలు సూచనలు చేశారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్‌ అధికారి డైరీ రాయడం, ఫారం 17 సి నింపడం వంటి చర్యలపై శ్రద్ద తీసుకోవాలని అన్నారు. సెక్టార్‌ అధికారులు సైతం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్‌ ప్రక్రియ పైనా, ప్రిసైడింగ్‌ అధికారుల విధులు పైనా సెక్టార్‌ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, వారికి తలెత్తే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసే స్థాయిలో ఉండాలని ఆదేశించారు. మాక్‌ పోలింగ్‌ ను పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూం లను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, సాలూరు నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణుచరణ్‌, తహశీ ల్దార్లు, సెక్టార్‌, ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

కురుపాం : శిక్షణను సద్వినియోగం చేసుకుని ఎన్నికల విధులు సమర్ధ వంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. స్థానిక మోడల్‌ స్కూల్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ సందర్శించి ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధులు నిర్వహణ తదితర అంశాలపై అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో పాలకొండ ఆర్‌డిఒ, కురుపాం ఆర్‌ఒ వి.వెంకటరమణ, తహశీల్దార్లు, సెక్టార్‌, ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట : ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ రోజు ప్రిసైడింగ్‌ అధికారి పాత్ర కీలకమైనదని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కల్పనకుమారి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ఇస్తోన్న శిక్షణా తరగతులను ఆర్వో పరిశీలించారు. ఈ సంధర్బంగా ఆర్వో మాట్లాడుతూ పోలింగ్‌ రోజు పిఒ, ఎపిఒలు చేపట్టవలసిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో అన్ని అంశాలను తెలుసుకోవాలన్నారు. మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇవియం యంత్రాల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ రోజు నిర్దిష్ట సమయానికి పోలింగ్‌ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, మాస్టర్‌ ట్రైనీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️