రాత్రి 8 వరకూ పోలింగ్‌

May 13,2024 22:30

ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఎస్‌.కోట నియోజకవర్గంలో రాత్రి 9గంటల వరకు పోలింగ్‌ సాగింది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 6గంటల సమయానికి 74.85శాతం ఓట్లు నమోదయ్యాయి. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన ఎన్నికల ప్రక్రియ కొన్నిచోట్ల ఇవిఎంలు మొరాయించడం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. శృంగవరపుకోట మండలంలోని రేవల్ల పాలెం, పోతనపల్లి, పట్టణంలోని గర్ల్స్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఇవిఎంలు మొరాయించాయి. జామి మండలంలో జాగరం, చింతాడ, లొట్లపల్లి, వేపాడ మండలంలోని సోంపురం అదేవిధంగా కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లోని పలు గ్రామాల్లో ఇవిఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎన్నికల అధికారులు ఓటర్లకు అరకొర సౌకర్యాలు కల్పించడం పోలింగ్‌ కేంద్రాల వద్ద సరిపడా టెంట్‌లు చాలక, తాగునీరు, వృద్ధులకు, వికలాంగులకు వీల్‌ చైర్స్‌ లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత వల్ల కొంతమంది ఓటర్లు మధ్యాహ్నం ఓటు వేయ వచ్చని వెనుతిరగడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లు పెరిగాయి. సాయంత్రం 6 గంటల సమయానికి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మండలంలోని బొడ్డవర, సీతమ్మ పేట, పట్టణంలోని చింత స్కూలు, శ్రీనివాసకాలనీ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల డిప్యూటీ తాహశీల్దార్‌ నారాయణమ్మను వివరణ కోరగా పోలింగ్‌ సమయం ముగిసేసరికి ఇంకా నాలుగు కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు వేసేందుకు ఉన్నారని, రాత్రి 9 గంటల లోపు పోలింగ్‌ పూర్తవుతుందని తెలిపారు. ఇచ్చారు. సాయంత్రం 6 గంటల సమయానికి శంగవరపుకోట నియోజకవర్గం 77.78 శాతం పోలింగ్‌ నమోదయిందని ఎన్నికల అధికారి తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కడుబండి శ్రీనివాసరావు, కోళ్ల లలిత కుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్కవరపుకోట మండలం ఖాసాపేటలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 126 కోళ్ల లలిత కుమారి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోగా కొత్తవలసలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 212లో కడు బండి శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరకొర ఏర్పాట్లతో ఓటర్ల ఇబ్బందులు కొత్తవలస :కొత్తవలస మండలంలో పోలింగ్‌ బూత్‌ల వద్ద ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. సంతపాలెం పోలింగ్‌ కేంద్రంలో అరగంట పాటు ఇవిఎం ఇబ్బంది పెట్టినప్పటికీ తరువాత సిబ్బంది సరి చేశారు. కొత్తవలస మండలం కంటకాపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు అరకొరగా ఉన్నాయని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. వద్ధులు, వికలాంగుల ఓటర్లను పోలింగ్‌ బూత్‌ లోకి తీసుకు వెళ్లడానికి సరి అయిన పరికరాలు, వీల్‌ చైర్స్‌ లేక ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 202 పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

➡️