ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది

Apr 12,2024 21:45

 ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఘోషా ఆసుపత్రి ఏరియా, తోటవీధి, అంబటిసత్రం, అశోక్‌ నగర్‌, తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి నిర్వహిస్తున్న సభలు దిగ్విజయం కావడం చూసి వైసిపి నాయకుల్లో టెన్షన్‌ మొదలైందన్నారు, రాబోయేది ప్రజా ప్రభుత్వమని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారిని కక్షసాధింపు రాజకీయాలు చేయడం, వేధింపులకు గురిచేయడం వంటి అరాచకపాలన తప్ప ప్రజాపాలన చేతకాని ప్రభుత్వమిది అని విమర్శించారు. ఇటువంటి చేతకాని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మి వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️