పకడ్బందీగా ఓటరు సహాయక కేంద్రాల ఏర్పాటు

Mar 22,2024 13:33 #Nellore District
  • పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సెక్టోరల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్

ప్రజాశక్తి-కోవూరు : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఓటరు సహాయక కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, ఈ విషయమై సెక్టోరల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు. శుక్రవారం కోవూరులోని జేబీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లందరూ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పక్కాగా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేపడుతున్నట్లు చెప్పారు. ఎక్కువ ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశంలో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సహాయక కేంద్రం ద్వారా ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకుని, ఆ పోలింగ్ కేంద్రానికి సులువుగా వెళ్లి ఓటు వేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. దీంతో ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టిసారించామని, వేసవికాలం దృష్ట్యా ఎండ, వడగాలుల నుంచి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా టెంట్లు ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో ఉంచడం వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో వికలాంగుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ర్యాంపుల ఏర్పాటు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై సెక్టోరల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అని ఏర్పాట్లు ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఈఆర్వో శ్రీనివాస్, తాసిల్దార్ విజయశ్రీ, సెక్టోరల్ అధికారి ఇందిరావతి ఉన్నారు.

➡️