బాపట్లలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మిస్తాం : సినీ రచయిత కోన వెంకట్

Apr 19,2024 00:47 ##bapatla #konavenkat

ప్రజాశక్తి – బాపట్ల
శరవేగంగా పరుగులు తీస్తున్న డిజిటల్ విధానం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్లలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని సినీ మాటల రచయిత కోన వెంకట్ తెలిపారు. కోన ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, వర్ధమాన సినీ నటులు, నటనపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ బాపట్లలో శిక్షణ పొందే విధంగా ఇక్కడ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. బాపట్లలో సినీ స్టూడియో ఏర్పాటుతోపాటు దానికి అనుబంధంగా ఏర్పాటు చేసే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ద్వారా బాపట్ల సీమను సినీ పరిశ్రమలో ఒక భాగం చేస్తామని అన్నారు. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్న బాపట్ల సీమలో సినీ రంగానికి సరిగ్గా సరిపోయే సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఇక్కడ రూపుదిద్దుకోబోతున్న సినీ రంగ అనుబంధ పరిశ్రమల ద్వారా కొన్ని వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని అన్నారు. ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలకు కార్ఖానాగా విరాజిల్లుతున్న బాపట్ల ప్రాంతంలో అనుబంధ సినీ పరిశ్రమల ఏర్పాటు ఆలోచన సంతోషాన్ని కలిగించిందని అన్నారు. రాజకీయ రంగాన కోనా కుటుంబానికి ఇది రజతోత్సవ సంబరమని అన్నారు. పాతికేళ్లుగా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు సినీ అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేయటం ద్వారా తమ కుటుంబం అందించే అభిమాన కానుకగా పేర్కొన్నారు.

➡️