కలాశాల ‘చదువుకు’ సిద్ధం

May 26,2024 19:54

ప్రజాశక్తి – జామి : అది దశాబ్దాల నాటి కల..పేద విద్యార్థుల చదువుల సహకారానికి సార్ధకమయ్యే ఆశ.. ఎందరో విద్యావంతుల అభిలాష.. మొత్తంగా జామి గ్రామంలో ప్రభుత్వ కాలేజీ చదువులకు సన్నద్ధమైంది. జామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకూ చదువుకున్న విద్యార్థులకు రెండేళ్లు పాటు కాలేజీ చదువులు (ప్లస్‌ -2) అభ్యసించే అవకాశం రానే వచ్చింది. అయితే చదువు చెప్పే అధ్యాపకులు, ఇంటర్‌ చదువులకు కావాల్సిన సౌకర్యాలు సమాకురాల్సి ఉంది. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ చదివే విద్యార్థులు అవకాశాన్ని సధ్వినియోగం చేయనుకోవాలని ఉపాధ్యాయులు, అధికారులు కోరుతున్నారు.మండలంలో 25 పంచాయతీలుండగా, అందులో మెజారిటీ ప్రజానీకం వ్యవసాయాధారిత కుటుంబాలే. మండలంతో పాటు ఎస్‌.కోట, ఎల్‌.కోట, వేపాడ, గంట్యాడ మండలాల్లో అనేక గ్రామాలు మండల కేంద్రానికి అతి చేరువలో ఉంటాయి. విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని కొన్ని గ్రామాలు కూడా జామి మండల కేంద్రానికి సమీపాన ఉంటాయి. కానీ పదో తరగతి తర్వాత ఇంటర్‌ చదువులకు విజయనగరం, ఎస్‌.కోట, కొత్తవలస, విశాఖ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతోంది. కాబట్టి జామిలో జూనియర్‌ కాలేజి వస్తే, వేలాది మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజి అందుబాటులోకి వచ్చి ఉన్నత చదువులకు వీలు కలుగుతోందని ఆశపడ్డారు. అనుకున్నట్లే ఇంటర్‌ చదువులకు అవకాశం లభించింది. ఇప్పటికే 40 మందికి పైగా కాలేజీలో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. కాలేజీ ప్రారంభంలో తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి, ఉన్న అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.భారమైన ఇంటర్‌ చదువులుకార్పొరేట్‌ చదువులు కాలంలో ఇంటర్‌ చదవడం ఖర్చుతో కూడుకున్న పని. కనీసం రూ.50 వేలు నుంచి రూ. లక్ష మధ్య ఒక ఏడాది చదువుకు వెచ్చించాలి. రెండేళ్లు చదవడానికి అవకాశం లేక ఎక్కువ కుటుంబాల్లో ఆడపిల్లలను చదువులు ఆపేసి, పెళ్లిళ్లు చేస్తున్న పరిస్థితి. వ్యవసాయ కుటుంబాలలో అబ్బాయిలను పొలం పనులకు పంపుతున్న తీరు. ఈ నేపథ్యంలోనే మండల కేంద్రంలో ప్రభుత్వం జూని యర్‌ కాలేజీ ఏర్పాటు చేయడంతో సొంత ఊరిలో ఇంటర్‌కు అవకాశం రావడం, పది తరువాత డ్రాపౌట్స్‌ను ఆపే అవకాశం ఉంది. ప్రతి పేద విద్యార్థి ఇంటర్‌ చదువును పూర్తి చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అధికారులు కోరుతున్నారు.కాలేజీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి జూనియర్‌ కాలేజీ సాధనకు జామిలో ఉద్యమమే జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఇంటర్‌ చదువు ప్రభుత్వం మన బడిలోనే అందించేందుకు రంగం సిద్ధం చేసింది. మంచి అధ్యాపకులు, ఇంటర్‌ చదువులకు కావాల్సిన సౌకర్యాలు సమాకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి కాలేజీ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, మేధావులు, పెద్దలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే మండల స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, స్థానిక ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావుల సూచనలు సలహాలు స్వీకరించాల్సిన అవసరం లేకపోలేదు. కాలేజీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

➡️