ఫిబ్రవరి 16 గ్రామీణ భారత్ బంద్ కు సిద్ధం కండి : సిఐటియు

Jan 28,2024 16:58 #CITU, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ బందు మరియు పట్టణ ప్రాంతాల్లో, పారిశ్రామిక కేంద్రాల్లో భారీ కార్మిక సమీకరణాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన కార్మిక కర్షక భవన్లో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున భారత బందుకు పిలుపు ఇవ్వడం జరిగిందని దీనిని జయప్రదం చేయడం కోసం ఇప్పటినుండి కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంపద మొత్తాన్ని కొంతమంది పెట్టుబడిదారులు అందులో ప్రధానంగా ఆదాని ,అంబానీ లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. రైతులను కారుతో ఎక్కించి చంపిన ఘటనలో సంబంధమున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పైచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన పై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. సమగ్ర రుణమాఫీ చేయాలని, కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రాథమిక హక్కుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని కోరారు. రైల్వే రక్షణ విద్యుత్తు తో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణఆపాలని, ఉద్యోగాల్లో కాంట్రాక్ట్రీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటిత, ఆ సంఘటిత ఆర్థిక వ్యవస్థలు అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని,సామాజిక భద్రత కల్పించాలని కోరారు .కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 104 రద్దు చేయాలని దీని వల్ల ఆటో మరియు వాహన డ్రైవర్లకు అందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. స్వతంత్ర మీడియా స్వేచ్ఛపై దాడి చేసి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కార్మికులు మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జరుగు ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు బి. రామాంజనేయులు, ఎం. గోపాల్, సిహెచ్ సాయిబాబా, పి. నిర్మల, విజయ్, నాగేశ్వరరావు, పి. ఈరన్న తదితరులు పాల్గొన్నారు

➡️