పాఠ్య పుస్తకాలు సిద్ధం

పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారులు

ప్రజాశక్తి- కె.కోటపాడు

ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వ స్కూళ్లలో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడానికి పాఠ్య పుస్తకాలు బుధవారం ఈ మండల కేంద్రానికి చేరాయి. మారిన సిలబస్‌ మేరకు అన్ని పుస్తకాలు ముందుగానే వచ్చినట్లు మండల విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. పాఠశాలలు తెరిచిన వెంటనే వీటిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మండల పరిధిలో ఒకటి కేజీబీవీ, ఏడు జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు ఉన్నాయని, ఈ పాఠశాలల్లో పదవ తరగతి ఒక్కో విద్యార్థికి 11 పుస్తకాలు చొప్పున పాఠ్యపుస్తకాలు అందజేస్తామని తెలిపారు. అంతకుముందు మండలాలకు పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతున్న తీరును సమగ్ర శిక్ష సీఎంవో బి శకుంతల పరిశీలించారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నం డివిజన్లో అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ఆమె విలేకరులకు తెలిపారు. బుధ, గురువారాల్లో సబ్బవరం, కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, మాడుగుల ఎంఈఓలకు పుస్తకాలను అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి గందరగోళం లేకుండా ముందుగానే పాఠ్యపుస్తకాలు మండలాలకు చేరినట్లు వెల్లడించారు. ఆమె వెంట ఎంఈఓ 2 డివిడి ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

➡️