పేదలపై ధరల దరువు

Jun 17,2024 00:41

ప్రజాశక్తి – చిలకలూరిపేట : అందరూ పౌష్టికాహారం తినడంతోపాటు బాలలు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందించాలనే ప్రచారం వివిధ రూపాల్లో తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే మార్కెట్‌లో పరిస్థితి మాత్రం ప్రజలను పోషకాహారానికి దూరంగా నెట్టేస్తోంది. వెజ్‌ అని లేదు.. నాన్‌ వెజ్‌ అని లేదు.. దేని ధరలు చూసిన భయపెట్టే రీతిలో పెరిగాయి. కొన్నింటి ధరలు రెండింతలైతే మరికొన్నింటి ధరలు మూడింతలై వినియోగదార్లను భయపెడుతున్నాయి. ఇంత ధరపెట్టి కొనడం తమ వల్లకాదని రోజువారీ కూలి పనులు చేసుకునేవారు చేతులెత్తేస్తుంటే ఉద్యోగాలు చేసుకునే మధ్యతరగతి వారు సైతం కొన్ని సందర్భాల్లో తాము కొనాల్సినవి కుదించేసుకుంటున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని కూరగాయల ధరలు కిలో రూ.80 వరకు పలుకుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఉల్లిపాయలు, టమాట, ఇతర కూరగాయల ధరలు 60 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శన. మే నెల 3వ వారంలో రూ.20 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.50కు చేరింది. టమాట రూ.60కుపైగానే, క్యారెట్‌, వంకాయలు, బీన్స్‌, బీరకాయలు రూ.70-80 మధ్య ధరలున్నాయి. ఆకు కూరలను గతంలో రూ.10కి 3 కట్టలు ఇవ్వగా ఇప్పుడు రూ.15కు 2 కట్టలే ఇస్తున్నారు. చిలకలూరిపేటలకు కూరగాయలను బాపట్ల జిల్లా మార్టూరు నుండి హోల్‌సేల్‌గా తెచ్చి స్థానికంగా హోల్‌సేల్‌గా, రిటైల్‌గానూ విక్రయిస్తుంటారు. ఆకు కూరలను మండలంలోని మురికిపూడి, బాపట్ల జిల్లా చీరాల నుండి తెచ్చి అమ్ముతుంటారు. పంట ఉత్పత్తి తగ్గడం, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల ధరలు పెంచినట్లు అక్కడివారు చెబుతున్నారని, ఈ ధరల వల్ల తామూ బేరాలను చాలా వరకు కోల్పోతున్నామని స్థానిక విక్రేతలు వాపోతున్నారు.ఇదిలా ఉండగా మాంసం ధరలు సైతం సామాన్యులు కొనలేని స్థాయిలో పెరిగాయి. చికెన్‌ కిలో 320, మటన్‌ రూ.900 ఉండగా బీఫ్‌ గతంలో రూ.300 విక్రయించేవారు ఇప్పుడు రూ.500కు పెంచారు. గాడిద మాంసం అయితే రూ.300 నుండి రూ.800కుపైగానే పెరిగింది. చేపలు కిలో రూ.800-900 వరకు ఉన్నాయి. వాటిని శుభ్రం చేశాక తూకం వేస్తే పావుకిలోకుపైగానే తగ్గుతోంది. ఈ లెక్కన అచ్చంగా కిలో చేపల ధర రూ.వెయ్యి నుండి రూ.1200 వరకు అవుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే తానేమీ తగ్గనన్నట్లు కోడిగుడ్ల ధరలు సైతం ఎగురుతున్నాయి. ఒక గుడ్డును రూ.ఆరున్నర నుండి రూ.7 వరకూ అమ్ముతున్నారు. పెద్ద మాల్స్‌లో అయితే రూ.10 వసూలు చేస్తుండగా నాటు కోడిగుడ్లను మాత్రం ఒక్కోగుడ్డును రూ.20-30 వరకూ అమ్ముతున్నారు. అయితే ఈ ధరలను బోర్డులపై రాయడం లేదు. కోళ్ల ఉత్పత్తి తగ్గిన కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. చేపటలను గతంలో మండలంలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో పెంచి వాటిని అమ్మేవారు. దీంతోపాటు ప్రత్యేకంగా కొన్ని చేపల చెరువులు ఉండేవి. అయితే ఇప్పుడు చెరువులు తగ్గిన కారణంగా విజయవాడ నుండి తాము చేపలను తేవాల్సి వస్తోందని, తమకు గిట్టుబాటు అవ్వాలంటే ధర పెంచక తప్పదని స్థానిక విక్రేతలు చెబుతున్నారు. మరోవైపు ఇంత ధర ఎందుకని సామాన్యులు ఆలోచించేలోపే ధనవంతులు ధరతో నిమిత్తం లేకుండా కొనేస్తున్నారని, కొందరు వినియోగదారులు తమ అనుభవాలను చెబుతున్నారు. ఇదిలా ఉండగా బీఫ్‌, గాడిద మాంసం తినేవారి సంఖ్య పెరిగిన కారణంగా వాటికీ డిమాండ్‌ పెరిగి ధరలను పెంచారని కొంతరు వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా పెరిగిన ధరలు పేదలు, కూలీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మధ్యతరగతిని ఆయోమయంలో పడేస్తున్నాయి. ధరల నియంత్రణపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ప్రజలంతా పౌష్టికాహారం తీసుకోగలరని, లేకుంటే అరకొర భోజనాలతో సరిపెట్టుకోవాల్సిందేనని సామాన్యులు నిట్టూరుస్తున్నారు.

➡️