స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపాలి

Jun 16,2024 20:55

ప్రజాశక్తి – జామి : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్బంగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైయివేటీకరణ ఆపాలని జామి మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆదివారం మండల పరిషత్‌ సమావేశం భవనంలో ఎంపిపి సబ్బవరపు అరుణ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, జెడ్‌పిటిసి సరయు అతిధులుగా పాల్గొన్నారు. విశాఖ స్టీల్‌ ప్రయివేటీకరణ రద్దుకు నూతన ప్రభుత్వం కృషి చేయాలని, ఇప్పటికే గతంలో తీర్మానం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. అనంతరం జామిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జిల్లా పెద్దలు చేసిన కృషిని అభినందిస్తూ తీర్మాణం చేశారు. అయితే ఇటీవల జామి హైస్కూల్‌ హెచ్‌ఎం, ప్రజాప్రతినిధులు కాకుండా రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాన్ని పెట్టి, ప్రోటోకాల్‌ తప్పిన అంశాన్ని సభ దృష్టికి తీసుకురాగా, ఎంఇఒ జయశ్రీ వివరణ ఇచ్చారు. ఇంటర్‌ జాయినింగుల కోసం అందరి సహకారం తీసుకుని అధికారులు పని చేయాలని, కానీ ఏకపక్షంగా వ్యవరించడం సరికాదన్నారు. ప్రోటోకాల్‌ తప్పితే, ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం చింతాడ సర్పంచ్‌ అప్పాన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటీవల తమ గ్రామంలో సర్పంచుల ప్రోటోకాల్‌ పాటించకుండా వ్యవసాయ అధికారులు వ్యవహారించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. హైవే నిర్మాణం వల్ల ఏర్పాటు చేసిన కల్వర్టుల్లో నీరు నిలిచి పోవడంతో వ్యవసాయ పనులకు ఇబ్బంది కలుగుతుందని, తహశీల్దార్‌ వెంటనే హైవే ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా, చెరువుల్లో మట్టి తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులు అధికారులను కోరారు. విత్తనాలు, ఎరువులు పంపిణీ అంశం పై చర్చ చేపట్టిన సభ్యులు, సక్రమంగా రైతులకు అందేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ, వైస్‌ ఎంపిపిలు విజయలక్ష్మి, వెంకటరావు, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

➡️