సర్కారు బడుల్లో సమస్యల తిష్ట

May 22,2024 20:59

చ దువు కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు

గ్రామాల్లో పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మండలంలోని 170 పాఠశాలల ఉన్నాయి. ఇందులో మండల పరిషత్‌ 56, ప్రభుత్వ ప్రాథమిక 32, ఆశ్రమ పాఠశాలలు 13, ఎయిడెడ్‌ 4, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు 65ఉన్నాయి. తాడికొండ, దుడ్డు ఖల్లు, టిక్కుబాయి, కొత్తగూడ, కోసింగిభద్ర ఆశ్రమ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ కరువైంది. అడవి, కొండల సమీపంలో పాఠశాలల నిర్వహణ ఉండడంతో రాత్రి వేళల్లో ఏదైనా అడవి జంతువు, విష సర్పాలు వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మినరల్‌ వాటర్‌ అందుబాటులో లేకుండా పోయింది. గతంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల పాడవ్వడంతో మూలకు చేరాయి. మండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రన్నింగ్‌ వాటర్‌ అందుబాటులో లేకపోవడంతో మరుగుదొడ్లు వినియోగం లేకుండా పోయాయి. రానున్నది వర్షాకాలం కావడంతో విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశం ఉంది. చదువుకునేందుకు వస్తున్న విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. గత కొన్నేళ్ల నుంచి ఆదివాసీ ఆరోగ్య సిబ్బంది లేకపోవడంతో వార్డెన్లు నియమించుకొని నెలవారీగా కొంత మొత్తం చెల్లిస్తున్నారు.పదేళ్లుగా బయట చదువులకు విద్యార్థులు మండలంలోని డుమ్మంగి, బొద్దిడి గ్రామాల్లోని ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడ్డంతో గత పదేళ్లుగా విద్యార్థులు చదువుకునేందుకు ప్రతిరోజూ బయట ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. డుమ్మంగి నుంచి 20 మంది విద్యార్థులు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మలక్ష్మీపురం, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. మరోవైపు బొద్ధిడిలో పాఠశాల లేకపోవడంతో ఆ గ్రామ చిన్నారులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దఖర్జలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువులు సాగిస్తున్నారు. ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడుతూ తమ పిల్లలు చదువుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి నుంచి చదువు కోసం వెళ్లిన పిల్లలు ఎప్పుడు వస్తారోనని వేయికళ్లతో ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. డుమ్మంగిలో ఐటిడిఎ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు చేసి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని అధికారులు హామీ ఇచ్చినా నేటికీ నియమించలేదని సర్పంచి పాలక క్రాంతి కుమార్‌ తెలిపారు. డుమ్మంగి, పి.ఆమిటి గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించలేదని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికైనా గ్రామాల్లో పాఠశాలల ఏర్పాటు చేసి చిన్నారులకు స్థానికంగా విద్యాబోధన చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️