పక్కాగా బందోబస్తు

May 9,2024 21:29

ప్రజాశక్తి- చీపురుపల్లి : ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు విడుదలైనా బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ సిధ్దంగా ఉంటుంది. ఎన్నికల వేల ఎటువంటి అసాంఘిక సంఘటనలూ జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే చీపురుపల్లి సర్కిల్‌లో ఉన్న చీపురుపల్లి, గరివిడి, గుర్ల, బుదరాయవలస పోలీస్టేషన్‌ పరిధిలోని నేరస్తుల వివరాలు, సమస్యాత్మక గ్రామాలు, పాత నేరస్తులపై బైండోవర్‌ కేసులు, అక్రమంగా మద్యం, డబ్బు సరఫరా కాకుండా చెక్‌పోస్టుల నిర్వహణ వంటివి ఏర్పాటు చేశాం. టెక్నాలజీని కూడా ఈ ఎన్నికలలో వినియోగిస్తున్నామని చీపురుపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సిహెచ్‌ షన్ముఖరావు తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..ఇది వరకు ఎన్నికల సమయంలో మండలాల వారీగా నేరాల వివరాలు సేకరించే పరిస్థితి ఉండేద. ఇప్పుడు పోలింగ్‌ స్టేషన్‌ వారీగా నేరాలు, నేరగాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. గడచిన ఐదేళ్లలో ఆయా పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన నేరాలు ఎలా ఉన్నాయి. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, అనే అంశాలను పరిగణనలోనికి తీసుకున్నాం. ఈ క్రమంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాం. ఎన్నికల కమిషన్‌తో పాటు మాపై అధికారులు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం.22 సమస్యాత్మక గ్రామాలు నియోజకవర్గంలో 22 సమస్యాత్మక గ్రామాలను గుర్తించాం. చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రావివలస, జి.అగ్రహారం, పుర్రాయవలస, బెవరపేటతో పాటు చీపురుపల్లిలో నాలుగు పోలింగ్‌ స్టేసన్లను సమస్యా త్మకంగా గురించాం. గరివిడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కె.పాలవలస, బిజెపాలేం, వెదుళ్లవలస, కాపుశంభాం, గుర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాగళ్లవలస, గుజ్జింగవలస, జమ్ము, చింతలపేట, బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉత్తరావిల్లి, బైరిపురం, గరుగుబిల్లి, బుదరాయవలస, గర్బాం గ్రామాలున్నాయి. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలతో పాటు చీపురుపల్లిలో కూడా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో కవాతులు కూడా నిర్వహించాం.3వేల బైండోవర్‌ కేసులు నమోదుగతంలో నేరాలకు పాల్పడిన వారిపై ఇప్పటికే బైండోవర్‌ కేసులు పెట్టాం. ఈక్రమంలో నియోజకవర్గంలో ఉన్న నాలుగు పోలిస్‌ స్టేషన్ల పరిధిలో సుమారు 3వేల మంది మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశాం. పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా చూసుకుంటే చీపురుపల్లిలో 680 మంది, గరివిడి 688, గుర్ల 801, బుదరాయవలస పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 752 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసాం. బైండోవర్‌ కేసులలో ఉన్నవారు ఎన్నికల వేల ఏవైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వారి వద్ద నుండి లక్ష రూపాయలు పూచీ కత్తు కూడా తీసుకున్నాం. అక్రమ మద్యం, మనీ సరఫరాపై నిఘాఎన్నికల వేల ఇతర ప్రాంతాల నుండి నియోజకవర్గానికి అక్రమంగా మద్యంగాని, డబ్బు గానీ సరఫరా చేస్తే ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ద్వారా చెక్‌ చేసి చర్యలు తీసుకుంటున్నామని సిఐ తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణలో ఓటు వేసేలా తమ పరంగా చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.

➡️