రాజశేఖర్‌ సేవలు మరువలేనివి

May 18,2024 23:28 #died, #Rajasekhar
Rajasekhar photo

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరం : హైకోర్టు రిజిస్ట్రార్‌గా సేవలందించిన బి.రాజశేఖర్‌ సేవలు మరువలేనివని గుజరాత్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ చీకటి మానవేంద్రరారు పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ కోవిడ్‌ సమయములో గుండెపోటుతో మరణించిన బి.రాజశేఖర్‌ ఫొటో ఆవిష్కరణను కుటుంబ సభ్యుల ఆధ్వర్యాన దసపల్లా హోటల్‌లో శనివారం ఏర్పాటుచేశారు. ఈ మానవేంద్రరారు ముఖ్యఅతిథిగా హాజరై రాజశేఖర్‌ ఫొటోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మానవేంద్రరారు మాట్లాడుతూ, 1995లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన రాజశేఖర్‌ అంచలంచెలుగా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ స్థాయికి ఎదిగారన్నారు. రాజశేఖర్‌ న్యాయవాదిగా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా అనేక కేసులు వాదించారని, న్యాయమూర్తిగానూ విధి నిర్వహణలో తనదైన శైలితో అనేక తీర్పులు వెల్లడించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సాంకేతిక సమాచార రిజిస్ట్రార్‌గా సుప్రీంకోర్టు ఇచ్చిన సూత్రాలకు అనుగుణంగా హైకోర్టు, జిల్లా స్థాయిలోని కోర్టులను సాంకేతికంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. కింది కోర్టులలో సాంకేతికతను అతివేగంగా విస్తరింపజేశారని తెలిపారు. విశిష్ట అతిథి ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ చీమలపాటి రవి మాట్లాడుతూ, విశాఖపట్నం న్యాయవాదుల సంఘం ప్రతిష్టను రాజశేఖర్‌ ఇనుమడింపజేశారన్నారు. విశిష్ట అతిథి, విశ్రాంతి న్యాయమూర్తి డివిఎస్‌ఎస్‌ సోమయాజులు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.కృష్ణమోహన్‌, ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల మాజీ ప్రొఫెసర్‌ కేశవరావు, సత్యనారాయణ తదితరులు రాజశేఖర్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, జనరల్‌ సెక్రటరీ దంతా నరేష్‌కుమార్‌, సీనియర్‌ న్యాయవాదులు టివిఎస్‌ కెకె కనకరాజు, కుప్పిలి మురళీధర్‌, బగాది తులసీదాస్‌, పూర్వ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రవీంద్రప్రసాద్‌, బండారు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️