చీనీ సాగుకు రైతుల విముఖత

ప్రజాశక్తి సింహాద్రిపురం జిల్లాలో చీనీ తోటల పెంపకానికి ప్రసిద్ధిగాంచిన సింహాద్రిపురం మండలంలో నేడు ఆ పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చీనీ చెట్లు నాటినప్పటి నుంచి ఆరేళ్ల పాటు ఎటువంటి ఆదాయం లేకుండానే పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 20, 22 సంవత్సరాల పాటు పంట దిగుబడులు వస్తాయి. రెండేళ్లుగా చీనీ చెట్లకు విపరీతమైన తెగులు కారణంగా దిగుబడి రాకుండానే చనిపోతున్నాయి. ఈ చెట్లను బతికించడానికి అనేక రకాల పురుగుమందులను పిచికారి చేసిన ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో రైతులు తోటలను వదిలేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికి వస్తుందన్న సమయంలో కన్నబిడ్డలా సాకిన చీనీ చెట్లు ఎలాంటి పల సాయం ఇవ్వకుండానే నిట్ట నిలువునా ఎండి పోతుండడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నియోజవర్గ వ్యాప్తంగా దాదాపు 27 వేల హెక్టార్లలో చీనీ చెట్లు సాగులో ఉన్నాయి. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో నాలుగు వేల హెక్టార్లలో చనిపోయిన చీనీ చెట్లను తొలగించి వాటి స్థానంలో అరటి, బొప్పాయి లాంటి ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు అనాసక్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 3 వేల ఎకరాలలో ఉపాధి హామీ పథకం ద్వారా చీనీ తోటల సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నారు. దీని ద్వారా ప్రతి లబ్ధిదారునికి ఒక్కొక్క ఎకరాకు మూడు సంవత్సరాల కాలానికి సంబంధించి రూ.1.50 లక్షలు ఇస్తారు. చీనీ చెట్లకు తెగులు అధికం కావడంతో ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారులు గుర్తించినప్పటికీ వారు చీనీ సాగుకు ముందుకు రావడంలేదని తెలుస్తున్నది.తెగుళ్ల గుర్తింపులో అధికారులు విఫలం ఇటీవల కాలంలో చీనీ చెట్లకు సోకిన తెగుళ్లను ఉద్యానవన శాఖ అధికారుల సైతం గుర్తించలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురుగుమందుల డీలర్లు సూచించిన అనేక రకాల మందులు పిచికారి చేసి వేల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్న ఫలితం మాత్రం శూన్యమని రైతులు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు దష్టికి సైతం తీసుకెళ్లిన ఏం మాత్రం ప్రయోజనం లేదని రైతులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు పరిశీలించి తెగులు నివారణకు మందులను సూచించాలని రైతులు కోరుతున్నారు.తెగుళ్లు కారణంగా చెట్లను తొలగించా రెండు సంవత్సరాల నుంచి చీనీ చెట్లకు విపరీతమైన తెగుళ్లు వచ్చాయి. రెండేళ్ల వయసు గల చెట్లను తొలగించా. తెగులు కారణంగా కాయలు కాపుకు రాని చెట్టు సైతం ఎండిపోతున్నాయి. అనేక మందులు కొట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు.- సుబ్బారెడ్డి, చీనీ రైతు, గురజాల.చీనీ చెట్లు నాటడానికి ఆసక్తి లేదు గతంలో పులివెందుల ప్రాంతంలో ఉన్న చీనీ తోటలకు మంచి గుర్తింపు ఉండేది. తెగులు కారణంగా చీనిచెట్టు విపరీతంగా ఎండిపోతున్నాయి. అధికారులకు సూచించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. చీనీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.- మహేశ్వర, చీనీ రైతు, తెలికి. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య చీనీ చెట్లు మంజూరైన లబ్ధిదారులు నాటుకోవాలని సూచించినప్పటికీ తెగుళ్ల కారణంగా చనిపోతున్న విషయాన్ని తమ దష్టికి తెచ్చారు. కొంతమంది రైతులు సాగుకు ఆసక్తి కనబరచడం లేదు. ఈ విషయాన్ని ఉద్యానవన శాఖ అధికారుల దష్టికి తీసుకెళ్తా.- సుబ్బారెడ్డి, ఎపిడి, పులివెందుల.

➡️