పోస్టల్‌ బ్యాలెట్‌లకు రీపోలింగ్‌

May 7,2024 00:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వల్ల 1219 మంది ఉద్యోగుల ఓట్లను ఎన్నికల కమిషన్‌ నిలిపివేసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ బదులు ఈవిఎంలకు వినియోగించే బ్యాలెట్‌లను వినియోగించారని ఎన్నికల పరిశీలకులు గుర్తించారు. చిలకలూరిపేట నియోజకవర్గం సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి గణపవరం జిల్లా పరిషత్‌ స్కూలులో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆదివారం పి.వోలు,ఎపివోలకు పోలింగ్‌నిర్వహించారు. మొత్తం 1219 మంది ఉదయం నుంచిసాయంత్రం వరకు క్యూ లోనిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్‌ పూర్తయిన తరువాత అధికారులు పొరపాటును గుర్తించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లకు బదులు ఈవిఎంలలో పెట్టే బ్యాలెట్‌లను ఉద్యోగులకు అందచేశారు. ఉద్యోగులు ఈ బ్యాలెట్‌లపై ఓటు వేశారు. ఓటింగ్‌ పూర్తయిన తరువాత గుర్తించిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియ చేశారు. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు నివేదించారు. ఈ అంశంపై టిడిపి నాయకులు ఈసికి ఫిర్యాదు చేశారు. 1219 మంది ఉద్యోగులు ఓట్లు మురిగిపోతున్నాయని తెలిసి వెంటనే వాటిని లెక్కింపులోకి తీసుకోకుండా రీపోలింగ్‌ నిర్వహించాలని, సంబంధిత బాధ్యులపై చర్య తీసుకోవాలని ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. పల్నాడు జిల్లాలో మొత్తం 16,282 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా గత రెండు రోజుల కాలంలో 9364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా వారు మంగళ, బుధవారాల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందంటున్నారు. 7,8 తేదీల్లో పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చారని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల కాలంలో 4722 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 20755 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 5751 మంది ఉన్నారు. గుంటూరు తూర్పులో 2778 మంది ఉన్నారు. అయితే జిల్లాలో ప్రత్యేకంగా మొదటి రోజులు పి.వో.ఎపివోలతో పాటు మైక్రో అబ్జర్వర్లకు మాత్రమే పోస్టల్‌ ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చామని మిగతా వారంతా 7,8 తేదీల్లో పోస్టల్‌ ఓట్లు వినియోగించుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు జిల్లాలో పి.వో, ఎపివోలకు ఉదయం పూట శిక్షణ, సాయంత్రం నుంచి పోలింగ్‌కు అవకాశం ఇచ్చామని అధికారులు తెలిపారు.

➡️