పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌?

Jun 17,2024 00:38

ప్రజాశక్తి-మాచర్ల : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి ప్రమేయంపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా వారిపై రౌడీషీట్‌ తెరిచినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల హింస, ముఖ్యంగా పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటులో పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసంతో పాటు, టిడిపి ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావుపై దాడి, ఒక మహిళను దుర్భాషలాడారని రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఆయనతోపాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎన్నికల మరుసటి రోజు కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకుని జనాలను భయభ్రాంతులకు గురిచేస్తూ టిడిపి శ్రేణులపై దాడులు చేశారని పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కారంపూడి సిఐ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచిన కేసులోనూ రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఇంకా పలు కేసులు పిన్నెల్లి బ్రదర్స్‌పై నమోదు కావటంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాజాగా మాచర్ల పోలీసులు రౌడీషీట్‌ తెరిచినట్లు సమాచారం. పోలింగ్‌ రోజు మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడి కాలనీలో ఓ ఇంటిపై దాడిచేసి టిడిపి కార్యకర్తలను గాయపరిచిన కేసులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైసిపి ప్రధాన నాయకులు బూడిద శ్రీను, మన్నయ్య మరికొంతమందికి జిల్లాకోర్టులో కండీషన్‌ బెయిల్‌ మంజూరైనట్లు తెలిసింది. వారి తరుపు లాయర్లు బెయిల్‌ పేపర్లు తీసుకొని మాచర్ల పోలీస్‌ స్టేషన్‌కు రాగా, కోర్టు నుంచి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం రానందున వారి సంతకాలు తీసుకునేందుకు స్థానిక అధికారులు నిరాకరించినట్లు తెలిసింది.

➡️