పిఎం కిసాన్‌ కింద జిల్లాకు రూ.37.72 కోట్లు విడుదల

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు

ప్రజాశక్తి- అనకాపల్లి

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద అనకాపల్లి జిల్లాకు 37 కోట్ల 72 లక్షల రూపాయల విడుదల అయినట్టు జిల్లా వ్యవసాయ అధికారి బి మోహన్‌ రావు తెలిపారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులైన రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పీఎం కిసాన్‌ యోజన పథకం 17వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో విడుదల చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని లబ్ధిదారులు స్మార్ట్‌ టీవీ ద్వారా వీక్షించారు. జిల్లాలో ఈ పథకానికి 1,88,614 మంది రైతులు అర్హులైనట్టు తెలిపారు. వారి వారి ఖాతాల్లో ఈ సొమ్ము జమ అవుతుందన్నారు. భీమునిపట్నం : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద లబ్ధిదారులైన ఒక్కో రైతు బ్యాంక్‌ ఖాతాలో రూ.2000 చొప్పున మంగళవారం ప్రధానమంత్రి విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్డేపల్లి విజయ ప్రసాద్‌ తెలిపారు. మండలంలోని ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ అధికారులు టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రదర్శించారు. తాటితూరు రైతు భరోసా కేంద్రం వద్ద ఎడి విజయప్రసాద్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి బి.శివకోమలి, ఆర్‌బికె వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.ఆనందపురం : పిఎం కిసాన్‌ యోజన 17వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని మండలంలోని వేములవలస పంచాయతీలో టీవీ ద్వారా రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. బంటుపల్లి కల్లాలు, వేములవలస పంచాయతీల్లో 350 మంది రైతులకు పిఎం కిసాన్‌ యోజన అందుతుందని అధికారులు తెలిపారు. గొలుగొండ : చోద్యం రైతు భరోసా కేంద్రంలో పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కార్యక్రమంపై మండల వ్యవసాయాధికారి సుధారాణి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆదపురెడ్డి గోపాలకృష్ణ, గాదె శ్రీనివాసరావు గ్రామస్థులు పాల్గొన్నారు.

➡️